బీరు బాటిల్‌లో కండోమ్ ప్యాకెట్.. మందుబాబు షాక్!

  • సిద్దిపేట జిల్లాలో సంఘటన 
  • కింగ్‌ఫిషర్ బీరు బాటిల్‌లో కనిపించిన కండోమ్ ప్యాకెట్
  • వైన్ షాపు ఎదుట బాధితుడి ఆందోళన.. సిబ్బందితో వాగ్వాదం
  • రంగంలోకి దిగిన ఎక్సైజ్ శాఖ.. దర్యాప్తు ప్రారంభం
బీర్ బాటిళ్లలో పురుగులు, బల్లులు రావడం గురించి విన్నాం. కానీ, ఏకంగా సీల్ చేసిన బీరు బాటిల్‌లోనే కండోమ్ ప్యాకెట్ రావడం సిద్దిపేట జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో బీరు ప్రియులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లిలోని లక్ష్మీ నరసింహ వైన్ షాపులో ఓ వ్యక్తి కింగ్‌ఫిషర్ లైట్ బీర్లు కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి కొన్ని బీర్లు తాగిన తర్వాత, సీల్ తీయని మరో బాటిల్‌ను చూడగా అందులో కండోమ్ ప్యాకెట్ కనిపించడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఆ బాటిల్‌ను తీసుకుని వైన్ షాపు వద్దకు వెళ్లి సిబ్బందిని నిలదీశాడు. అయితే, అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో అతడు మరింత ఆగ్రహానికి లోనయ్యాడు.

ఈ వ్యవహారంపై బాధితుడు వెంటనే స్థానిక ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. వైన్ షాపునకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. అసలు సీల్డ్ బాటిల్‌లోకి కండోమ్ ప్యాకెట్ ఎలా వచ్చిందని దర్యాప్తు చేస్తున్నారు. ఇది తయారీ సమయంలో జరిగిన లోపమా? లేక ఎవరైనా కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా? అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మందుబాబులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Beer Bottle
Condom Packet
Siddipet
Kingfisher Beer
Excise Police
Wine Shop
Adulteration
Liquor
Telangana
Viral Video

More Telugu News