భారత్‌కు డబుల్ షాక్.. రష్యా చమురుపై అమెరికా ఆంక్షలతో కొత్త చిక్కులు

Russia Oil Double shock to India due to US sanctions on Russia oil
  • రష్యా చమురుపై అమెరికా ఆంక్షల మినహాయింపునకు ముగింపు
  • ఇరాన్ యుద్ధంతో ఇప్పటికే అస్థిరంగా చమురు సరఫరా
  • భారత్‌పై ఒకేసారి రెండు వైపుల నుంచి ఇంధన ఒత్తిడి 
  • ఇటీవలే రూ.3 పెరిగిన ఇంధన ధరలు.. మళ్లీ పెరిగే అవకాశం
గత కొన్నాళ్లుగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం నుంచి అతి తక్కువ నష్టంతో బయటపడుతూ వచ్చిన భారత్‌కు ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలకు ఇచ్చిన మినహాయింపు గడువు ఆదివారంతో ముగిసింది. ఈ నిర్ణయంతో భారత్ ఇంధన సమీకరణాలు పూర్తిగా మారిపోయే ప్రమాదం ఏర్పడింది. ఒకవైపు ఇరాన్ యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధిలో చమురు రవాణా అస్థిరంగా మారగా, ఇప్పుడు రష్యా చమురుపై ఆంక్షల ముప్పు భారత్‌ను రెండు వైపుల నుంచి ఒత్తిడిలోకి నెట్టింది.

ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో భారత్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. తక్కువ ధరకే లభిస్తున్న రష్యా చమురును భారీగా దిగుమతి చేసుకుని ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కవచంగా వాడుకుంది. మే నెలలో రికార్డు స్థాయిలో రోజుకు 2.3 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురును భారత్ దిగుమతి చేసుకుంది. కొన్ని సందర్భాల్లో ఇది మన మొత్తం చమురు దిగుమతుల్లో సగానికి చేరింది. అయితే, తాజాగా అమెరికా తీసుకున్న నిర్ణయంతో భారత రిఫైనరీలకు ఆంక్షల భయం పట్టుకుంది.

తప్పని ధరల పెంపు?
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 105 డాలర్లకు పైగా ట్రేడ్ అవుతోంది. ఇరాన్ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యం నుంచి చమురు సరఫరా ఎప్పుడు నిలిచిపోతుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు చౌకగా లభించే రష్యా చమురుకు కూడా ఆంక్షల ముప్పు ఏర్పడటంతో భారత్‌కు గడ్డుకాలం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. తన అవసరాల్లో 85 శాతానికి పైగా చమురును దిగుమతి చేసుకునే భారత్‌పై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ఇటీవల లీటర్‌కు రూ.3 చొప్పున పెంచారు. తాజా పరిణామాలతో మళ్లీ ధరలు పెంచడం అనివార్యమని తెలుస్తోంది. పెట్రోస్ స్టోన్ ఎల్ఎల్‌పీ డైరెక్టర్ రిషభ్ జైన్ మాట్లాడుతూ "ఇంధన ధరల పెంపుతో దేశీయ లాజిస్టిక్స్, అంతర్జాతీయ రవాణా ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. చాలా కంపెనీలు ఉత్పత్తిని తగ్గించి, తమ వద్ద ఉన్న నిల్వలతోనే ఆర్డర్లను పూర్తి చేస్తున్నాయి" అని వివరించారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. పన్నులు తగ్గించడం, సబ్సిడీలు ఇవ్వడం వంటి చర్యలు ఖజానాపై భారం మోపుతాయి. మరోవైపు, ధరలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే, గతంలో మాదిరిగా ఇంధనాన్ని ఆదా చేసేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్, కార్యాలయ వేళల్లో మార్పులు వంటి చర్యలను ప్రభుత్వం మళ్లీ పరిశీలించే అవకాశం లేకపోలేదు.  
Go Back to Shorts
Russia oil
India oil imports
US sanctions
oil crisis
crude oil price
fuel price hike
Indian economy
Iran war
oil supply disruption
Rishabh Jain

More Telugu News