అమెరికాలో అలా... భారత్‌లో ఇలా! వర్క్ కల్చర్ పై బెంగళూరు యువతి వ్యాఖ్యలు వైరల్

Bangalore Employee Questions India Work Culture After US Visit
  • భారత్‌లో రాత్రి 10 గంటల వరకు పని చేసే సందర్బాలు ఉంటాయన్న యువతి
  • అమెరికాలో సాయంత్రం నాలుగున్నరకు కార్యాలయం ఖాళీ అవుతుందని వెల్లడి
  • అమెరికాలో ఉన్నప్పుడు తనకు చాలా కాలం తర్వాత ఖాళీ దొరికిందన్న యువతి
బెంగళూరుకు చెందిన ఒక ఉద్యోగిని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్టు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భారతదేశంలో, అమెరికాలో పనివేళలను ఆమె పోల్చారు. అమెరికాలో సాయంత్రం 4.30 గంటలకు కార్యాలయం మొత్తం ఖాళీగా కనిపిస్తుందని, అదే భారతదేశంలో అవసరమైతే రాత్రి 10 గంటల వరకు సాగుతుందని పేర్కొంది. చాలామంది నెటిజన్లు ఆమె వ్యాఖ్యలతో ఏకీభవించారు.

భారత్‌లో పని విధానం ఎలా ఉంది, అమెరికాలో తాను వెళ్లినప్పుడు దినచర్య ఎలా ఉందో ఆమె వివరించింది. భారతదేశంలోని ఎన్నో కార్యాలయాల్లో ఆఫీస్ టైమ్ అయిపోయినప్పటికీ ఎక్కువ సమయం పని చేయడం, నిరంతరం ఆఫీస్‌కు అందుబాటులో ఉంటారని తన అనుభవం నేర్పిందని పేర్కొంది.

ఆమె తెలిపిన వివరాల ప్రకారం, అమెరికాలో ఆమె ఉదయం 9.30 నుంచి 10 గంటల మధ్య కార్యాలయానికి చేరుకుంది. సాయంత్రం నాలుగున్నర గంటలకు చూస్తే కార్యాలయంలో తన ఫ్లోర్ మొత్తం ఖాళీగా ఉంది. సాయంత్రం 5 గంటలకల్లా చాలామంది ఉద్యోగులు తమ పనిని ముగించుకుని వెళ్ళిపోయారు. దీంతో తాను కూడా కార్యాలయం నుంచి వెళ్లిపోవాలనుకున్నట్లు వీడియోలో వెల్లడించింది.

చాలాకాలం తర్వాత, మొదటిసారి తనకు ఖాళీ సమయం దొరికిందని, దాంతో తాను హైకింగ్‌కు వెళ్లానని తెలిపింది. కానీ భారతదేశంలో పని చేస్తున్నప్పుడు మాత్రం తన వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయినట్లు పేర్కొంది.

భారతదేశంలో ఆఫీస్ ఉదయం 9 గంటలకు ప్రారంభమై, రాత్రి 10 గంటల వరకు సాగుతుందని తెలిపింది. అలాంటి షెడ్యూల్ ఉంటే సమయానికి భోజనం ఉండదని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే "ఇలా నాకే అనిపిస్తోందా లేక భారతదేశంలోని కార్పొరేట్ వాతావరణం క్రమంగా కఠినంగా మారుతోందా?" అని ఆమె వీడియో క్యాప్షన్‌లో రాసింది.

భారతదేశంలో వ్యక్తిగత సమయాన్ని పణంగా పెట్టి మరీ, కంపెనీలలో సమయానికి మించి పనిచేస్తారని పేర్కొంది. పైగా దీనికి నిబద్దత, ఉత్పాదకతకు సంకేతంగా చూస్తారని ఆందోళన వ్యక్తం చేసింది. మన వద్ద పని ఒత్తిడికి తోడు ఎక్కువ గంటల పని ఉంటుందని, అమెరికాలో ఫలితాల ఆధారిత విధానాన్ని చూశామని తెలిపింది.

ఎక్కువ గంటలు పనిచేస్తే ఉత్పాదకత ఉంటుందనే మనస్తత్వమే అసలు సమస్యకు కారణమని ఒక నెటిజన్ అభిప్రాయపడ్డారు. ఎక్కువ మంది ఆమె వ్యాఖ్యలతో ఏకీభవించారు. కానీ కొంతమంది ఆమె వ్యాఖ్యలతో విబేధించారు. చాలా ఐటీ కంపెనీలకు అమెరికా నుంచి వర్క్ వస్తుందని, అలాంటి సందర్బాలలో భారతదేశంలో పని చేసే ఉద్యోగికి ఏవైనా సమావేశాలు ఉంటే సాయంత్రం లేదా ఉదయం లాగ్-ఇన్ అవుతారని, రెండు దేశాలను పోల్చవద్దని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
Bangalore Employee
India Work Culture
US Work Culture
Work Life Balance
IT Sector
Corporate Culture

More Telugu News