సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ జాతీయ జట్టులోకి తన పునరాగమనంపై వస్తున్న చర్చలకు తెరదించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తరఫున అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, తాను మళ్లీ భారత జట్టులోకి రావడం గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేశాడు. గతంలో ఎదురైన నిరాశల కారణంగా దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం మానేశానని అన్నాడు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు 21 వికెట్లు పడగొట్టి ఆర్‌సీబీ విజయావకాశాల్లో కీలక పాత్ర పోషిస్తున్న 36 ఏళ్ల భువనేశ్వర్‌ను తిరిగి జాతీయ జట్టులోకి తీసుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు, క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌సీబీ విడుదల చేసిన ఓ వీడియోలో భువీ మాట్లాడుతూ.. "నేను టీమిండియా కమ్‌బ్యాక్ గురించి ఆలోచించడం లేదు. దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకోవడం ఎప్పుడో మానేశాను. ఎందుకంటే అలా చేసినప్పుడల్లా అది నాకు కలిసి రాలేదు" అని తెలిపాడు.

తన సుదీర్ఘ కెరీర్‌ను గుర్తుచేసుకుంటూ.. "నాకు సహజంగానే బంతిని స్వింగ్ చేసే నైపుణ్యం ఉంది. అది దేవుడిచ్చిన వరం. నేను ఎప్పుడూ ఎక్స్‌ప్రెస్ బౌలర్‌ను కాదు. వేగంగా బౌలింగ్ చేయకపోవడం వల్ల త్వరగా అలసిపోను. బహుశా అదే నా కెరీర్‌కు మేలు చేసి ఉండవచ్చు" అని వివరించాడు.

టీ20 ఫార్మాట్‌లో తన బౌలింగ్ వ్యూహాల గురించి మాట్లాడుతూ.. "పవర్‌ప్లేలో బంతి స్వింగ్ అయితే వికెట్ల కోసం ప్రయత్నిస్తా. డెత్ ఓవర్లలో ఆత్మవిశ్వాసంతో బంతులు వేయడం ముఖ్యం. ఏ దశలోనైనా సింపుల్‌గా ఆలోచించడమే నా మంత్రం" అని చెప్పాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోవడం వల్ల ఐపీఎల్ తర్వాత తగినంత విశ్రాంతి దొరుకుతోందని, ఇది తన పనిభారాన్ని తగ్గించడంలో సహాయపడుతోందని భువనేశ్వర్ పేర్కొన్నాడు.