గ్రహాంతరవాసులు (ఏలియన్స్), గుర్తుతెలియని ఎగిరే వస్తువుల (యూఎఫ్‌వో) ఉనికిపై దశాబ్దాలుగా కొనసాగుతున్న చర్చను అమెరికా రక్షణ ప్రధాన కార్యాలయం పెంటగాన్ మరోసారి తెరపైకి తెచ్చింది. యూఎఫ్‌వోలపై గతంలో అత్యంత రహస్యంగా వర్గీకరించిన 160కి పైగా ఫైళ్లను తాజాగా విడుదల చేసింది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు ఈ ఫైళ్లను బహిర్గతం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది.

1940ల నుంచి ఇప్పటివరకు సేకరించిన సమాచారంతో ఈ ఫైళ్లను రూపొందించారు. ఇందులో సైనిక సిబ్బంది చిత్రీకరించిన ఇన్‌ఫ్రారెడ్ వీడియోలు, రాడార్ చిత్రాలు, ఎఫ్‌బీఐ మెమోలు, నాసా వ్యోమగాముల నివేదికలు ఉన్నాయి. అత్యంత వేగంతో కదులుతూ దిశలు మార్చుకుంటున్న ప్రకాశవంతమైన గోళాలు, సిగరెట్, డిస్క్ ఆకారంలో ఉన్న వస్తువులను చూసినట్లు ఈ ఫైల్స్‌లో పేర్కొన్నారు. 1969లో చంద్రుడి సమీపంలో ఓ కాంతిపుంజాన్ని చూసినట్లు అపోలో 11 వ్యోమగామి బజ్ ఆల్డ్రిన్ చెప్పిన వివరాలు కూడా ఇందులో ఉన్నాయి.

అయితే, ఈ ఫైళ్లు ఏవీ కూడా గ్రహాంతరవాసుల ఉనికిని ధ్రువీకరించడం లేదని పెంటగాన్ అధికారులు స్పష్టం చేశారు. చాలా సందర్భాల్లో సెన్సార్లలో సాంకేతిక లోపాలు, వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా కొన్ని వస్తువులను యూఎఫ్‌వోలుగా భ్రమపడే అవకాశం ఉందని 2024 నివేదికలో పేర్కొన్నారు.

మరోవైపు, భారత్‌లోనూ యూఎఫ్‌వోల ప్రస్తావన ఉంది. 2023లో ఇంఫాల్ విమానాశ్రయం గగనతలంలో ఓ గుర్తుతెలియని వస్తువు కనిపించడంతో, దాన్ని అడ్డుకునేందుకు వాయుసేన రెండు రఫేల్ యుద్ధ విమానాలను పంపింది. అయితే, అది కాసేపటికే కనుమరుగైంది. భారత్-చైనా సరిహద్దులోని కోంగ్‌కా లా పాస్‌ను స్థానికులు యూఎఫ్‌వో బేస్‌గా భావిస్తుంటారు. అమెరికా తన డేటాను విడుదల చేసిన నేపథ్యంలో, ఏలియన్లపై నెలకొన్న ఆసక్తి కారణంగా ఇతర దేశాలు కూడా ఇలాంటి సమాచారాన్ని భద్రపరచాలని ఆలోచిస్తున్నాయి.