డెన్వర్ ఎయిర్‌పోర్ట్‌లో ఘోరం: టేకాఫ్ అవుతున్న విమానం ఢీకొని వ్యక్తి మృతి

Denver Airport Tragedy Man Dies After Being Hit by Plane
  • భద్రతా కంచె దూకి రన్‌వేపైకి వచ్చినట్లు గుర్తించిన అధికారులు
  • టేకాఫ్ నిలిపివేత.. 231 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితం
  • ఘటనపై అమెరికా ఫెడరల్ ఏజెన్సీల ఉన్నత స్థాయి దర్యాప్తు
అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (DEN) అత్యంత విషాదకరమైన, షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టేకాఫ్ కోసం రన్‌వేపై వేగంగా వెళ్తున్న విమానం కిందపడి ఒక గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని నిలిపివేసి, ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు.

వివరాల్లోకి వెళ్తే, ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ A321 విమానం (ఫ్లైట్ 4345) 224 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో లాస్ ఏంజిల్స్‌కు బయలుదేరింది. రన్‌వేపై విమానం వేగం పుంజుకుంటున్న సమయంలో, ఒక వ్యక్తి అకస్మాత్తుగా అడ్డుగా వచ్చాడు. అతడిని ఢీకొట్టిన వెంటనే విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్లు పైలట్ గుర్తించి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు "మేము ఒక వ్యక్తిని ఢీకొట్టాం. ఇంజిన్‌లో మంటలు వస్తున్నాయి," అని సమాచారం అందించారు.

క్యాబిన్‌లోకి పొగ వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమాన సిబ్బంది వెంటనే స్పందించి, ఎమర్జెన్సీ స్లైడ్ల ద్వారా ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు. ఈ క్రమంలో కొంతమందికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. మృతుడు భద్రతా కంచె దూకిన రెండు నిమిషాల్లోనే రన్‌వేపైకి చేరుకున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ భారీ భద్రతా వైఫల్యంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభించాయి. మృతుడి వివరాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.
Go Back to Shorts
Denver Airport
Frontier Airlines
airplane accident
fatal incident
airport security
runway collision
FAA investigation
NTSB investigation
Airbus A321
flight 4345

More Telugu News