విజయ్ గెలుపు దిగ్భ్రాంతికరం.. 'ఒకే ఒక్కడు' తరహా మార్పులు ప్రమాదం: జయప్రకాశ్ నారాయణ

  • తమిళనాడులో విజయ్ పార్టీ విజయం ఊహించనిదన్న‌ జేపీ 
  • 'ఒకే ఒక్కడు' సినిమా లాగా క్షణాల్లో మార్పులు కోరడం ప్రమాదకరమని వ్యాఖ్య‌
  • మంచి పాలన అందించినా స్టాలిన్ ఓడిపోవడం ఆశ్చర్యపరిచిందన్న లోక్‌సత్తా అధినేత
  • ప్రజలు సైలెంట్‌గా విజయ్ వైపు మొగ్గు చూపారని విశ్లేషణ
  • పెద్ద సిద్ధాంతాలు లేకుండా కొత్త ముఖం గెలవడం దిగ్భ్రాంతికరమని వ్యాఖ్య
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నటుడు విజయ్, ఆయన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) ఘన విజయంపై లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ పెట్టిన రెండేళ్లకే ద్రవిడ దిగ్గజాలను పక్కకు నెట్టి విజయ్ ముఖ్యమంత్రి పీఠానికి చేరువ కావడం తాను ఊహించలేదని, ఈ ఫలితాలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని అన్నారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు తన విశ్లేషణను పంచుకున్నారు.

జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ... "నిజాయితీగా చెప్పాలంటే ఇది ఎవరూ ఊహించని ఫలితం. కమల్ హాసన్, రజినీకాంత్ వంటి ఎందరో సినీ నటులకు దక్కని రాజకీయ విజయం విజయ్‌కు దక్కింది. తమిళనాడులో 50 శాతం పట్టణీకరణ ఉంది, ఉన్నంతలో అది మంచి పరిపాలన అందిస్తున్న రాష్ట్రం. అయినా సరే, మంచి పాలన అందిస్తున్న స్టాలిన్ ఓడిపోయి, ప్రజలు విజయ్ వైపు మొగ్గు చూపారు" అని అన్నారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన మరింత లోతుగా విశ్లేషించారు. "ప్రజలు, ముఖ్యంగా జన్‌జీ తరం యువత, తక్షణమే అద్భుతాలు జరగాలని ఆశిస్తున్నారు. 'ఒకే ఒక్కడు' సినిమాలో అర్జున్ ఒక్కరోజులో అన్నీ మార్చేసినట్టు, క్షణాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నారు. ఈ ఆలోచనా విధానం చాలా ప్రమాదకరం. అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ, దానికి సమయం పడుతుంది. మార్పును కోరుకోవడంలో తప్పు లేదు, కానీ అది తక్షణమే జరగాలనుకోవడం దేశానికి మంచిది కాదు" అని హెచ్చరించారు.

స్టాలిన్ ఓటమి వెనుక కుట్రలు, వ్యూహాలు ఉండి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. "ప్రజలు మూడో కంటికి తెలియకుండా చాలా సైలెంట్‌గా విజయ్ వైపు మళ్లారు. ప్రజల తీర్పును మనం విశ్లేషించలేం. ఎలాంటి బలమైన సిద్ధాంత ప్రాతిపదిక లేకుండా, కేవలం తన నటనతో జనాన్ని మెప్పించిన ఒక కొత్త ముఖం, ఇలా అనుహ్యంగా గెలవడం నిజంగా దిగ్భ్రాంతికరం. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ పరిణామంపై ఆత్మవిమర్శ చేసుకోవాలి, లేదంటే దేశం ప్రమాదంలో పడుతుంది" అని జయప్రకాశ్ నారాయణ స్పష్టం చేశారు.

Vijay Thalapathy
Tamil Nadu Politics
Tamilaga Vettri Kazhagam
Jayaprakash Narayan
Stalin
Lok Satta Party
Tamil Nadu Elections
political analysis
youth
one day cm

More Telugu News