యూఏఈపై ఇరాన్ డ్రోన్ల దాడి.. ముగ్గురు భారతీయులకు గాయాలు

UAE Iran Drone Attack Injures Three Indians in Fujairah
  • యూఏఈలోని ఫుజైరా ఆయిల్ జోన్‌పై ఇరాన్ డ్రోన్ దాడి
  • ఈ ఘటనలో ముగ్గురు భారత పౌరులకు గాయాలు
  • యూఏఈ జలాల్లో మూడు ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న సైన్యం
  • గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్
  • దుబాయ్, అబుదాబిలో మిస్సైల్ దాడుల హెచ్చరికలు జారీ
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో దేశంలోని ప్రధాన ఆయిల్ ఇండస్ట్రీ జోన్‌ అయిన ఫుజైరాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు భారతీయ పౌరులు గాయపడ్డారు. ఏప్రిల్ 8న అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత నెలకొన్న ప్రశాంతతకు ఈ దాడితో తెరపడింది.

ఫుజైరా మీడియా ఆఫీస్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం ఆయిల్ ఇండస్ట్రీ జోన్‌లో మంటలు చెలరేగగానే సివిల్ డిఫెన్స్ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. "ఫుజైరాలో జరిగిన దాడిలో ముగ్గురు భారతీయ పౌరులు గాయపడ్డారు. వారికి అవసరమైన వైద్య సంరక్షణ, సంక్షేమం అందేలా స్థానిక అధికారులతో మేం నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం" అని ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదికగా ఒక పోస్టులో పేర్కొంది.

మరోవైపు ఇరాన్ ప్రయోగించిన మూడు క్షిపణులను తమ జలాల్లో యూఏఈ సైన్యం విజయవంతంగా అడ్డుకుంది. నాలుగో క్షిపణి సముద్రంలో కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల నేపథ్యంలో యూఏఈ అధికారులు అప్రమత్తమయ్యారు. దుబాయ్, అబుదాబి నగరాల్లోని ప్రజలకు మొబైల్ ఫోన్ల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. "ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా క్షిపణి దాడుల ముప్పు పొంచి ఉంది. తక్షణమే సమీపంలోని సురక్షిత భవనాల్లోకి వెళ్లి తలదాచుకోండి. కిటికీలు, తలుపులు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండండి" అని ఆ సందేశంలో పేర్కొన్నారు.

ఫుజైరాలోని ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో మార్చి 14న కూడా ఫుజైరా పోర్టుపై ఇలాంటి డ్రోన్ దాడి జరిగింది. అప్పుడు కూడా మంటలు చెలరేగడంతో కొన్ని ఆయిల్ లోడింగ్ కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది. తాజా ఘటనతో గల్ఫ్ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తతలు నెల‌కొన్నాయి.
Go Back to Shorts
UAE
Iran drone attack
Fujairah
Indian citizens injured
oil industry
missile attack
Dubai
Abu Dhabi
Gulf tensions

More Telugu News