60 సెకన్లలోనే ఫుల్ బాడీ స్కానింగ్.. 'మిడ్‌జర్నీ' సంచలన ఆవిష్కరణ!
- ఏఐ ఇమేజ్ సంస్థ మిడ్‌జర్నీ వైద్య రంగంలోకి ప్రవేశం
- కేవలం 60 సెకన్లలో ఫుల్ బాడీ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసే పరికరం
- రేడియేషన్ లేకుండా నీటి కొలనులో పనిచేసే సరికొత్త టెక్నాలజీ
- ప్రస్తుతానికి వెల్‌నెస్ కోసమే, డయాగ్నోస్టిక్స్‌కు అనుమతులు అవసరం
'అల్ట్రాసోనిక్ సీటీ' లేదా 'మిడ్‌జర్నీ స్కానర్'గా పిలిచే ఈ పరికరాన్ని వినియోగించే విధానం చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఒక స్పా తరహా వాతావరణంలో, నీటితో నిండిన చిన్న కొలనులో వ్యక్తిని ఉంచి ఈ స్కానింగ్ నిర్వహిస్తారు. ఆ కొలను చుట్టూ అమర్చిన లక్షలాది సూక్ష్మ అల్ట్రాసౌండ్ సెన్సర్లు పంపే శబ్ద తరంగాలు.. శరీరంలోని కండరాలు, అవయవాలు, ఎముకల 3D మ్యాప్‌ను సిద్ధం చేస్తాయి. ఎంఆర్ఐ లేదా సీటీ స్కాన్‌ల తరహాలో రేడియేషన్ లేదా శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాల అవసరం లేకుండానే ఈ పరికరం పనిచేయడం విశేషం.
భవిష్యత్తులో ఆరోగ్య పరీక్షలను మరింత సరళతరం చేయడమే తమ లక్ష్యమని మిడ్ జర్నీ వ్యవస్థాపకుడు, సీఈఓ డేవిడ్ హోల్జ్ పేర్కొన్నారు. ఈ స్కానర్ ద్వారా లభించే చిత్రాలు ఎంఆర్ఐ ఫలితాలతో సమానమైన స్పష్టతను కలిగి ఉంటాయని, పైగా వంద రెట్లు వేగంగా ఫలితాలను అందిస్తాయని ఆయన వివరించారు. ప్రాథమిక దశలో ఈ స్కానర్లను వెల్‌నెస్, బాడీ కంపోజిషన్ మ్యాపింగ్ కోసం వినియోగించనున్నారు. 2027 నాటికి శాన్ ఫ్రాన్సిస్కోలో తొలి 'మిడ్‌జర్నీ స్పా'ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ వెల్లడించింది.
ఈ సరికొత్త సాంకేతికతపై వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ, కొన్ని పరిమితులను ప్రస్తావిస్తున్నారు. సాధారణ ఆరోగ్య పరీక్షలకు ఈ పరికరం ఉపయుక్తంగా ఉన్నప్పటికీ, మెదడు వంటి సున్నిత భాగాల స్కానింగ్‌లో ఎంఆర్ఐ స్థాయిని ఇది అందుకోలేకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.
అలాగే, పూర్తి శరీర స్కానింగ్‌లో తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం ఉందని, దీనివల్ల రోగుల్లో అనవసర ఆందోళన కలగడమే కాకుండా అదనపు పరీక్షల భారం పడుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతికత పరిశోధనా దశలోనే ఉంది. దీనిని రోగ నిర్ధారణ ప్రక్రియల్లో అధికారికంగా వినియోగించాలంటే ఎఫ్‌డీఏ వంటి నియంత్రణ సంస్థల నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాల్సి ఉంటుంది.