ఏపీ, తెలంగాణకు మూడు రోజుల పాటు వర్ష సూచన

  • ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం
  • తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ
  • ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని హెచ్చరిక

భానుడి భగభగలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా మున్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ద్రోణి విస్తరించి ఉన్నట్టు వెల్లడించింది.


ఈ వాతావరణ మార్పుల వల్ల గురువారం నుంచి శనివారం వరకు రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 


ఏపీలోని దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన పరిస్థితులు ఉండబోతున్నాయని వెల్లడించింది. వర్షాలు పడే అవకాశం ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల వేడి, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం కూడా కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


తెలంగాణ విషయానికి వస్తే... హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజులు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అయితే, గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో మాత్రం పెద్దగా మార్పు ఉండకపోవచ్చని, ఎండ తీవ్రత కొనసాగుతూనే మధ్యమధ్యలో వానలు పడతాయని అధికారులు తెలిపారు.


Rain forecast
Andhra Pradesh
Telangana

More Telugu News