మాజీ డీజీపీ శివధర్ రెడ్డిపై నూతన డీజీపీ సీవీ ఆనంద్ ప్రశంసలు

DGP CV Anand praises Ex DGP Sivadhar Reddy
  • 32 ఏళ్ల సర్వీసులో శివధర్ రెడ్డి సాధించిన విజయాలను కొనియాడిన సీవీ ఆనంద్
  • నక్సలిజం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఆయన పోషించిన పాత్రపై ప్రశంసలు
  • ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు పోలీసు కుటుంబాలకు ఎంతో మేలు చేశాయన్న నూతన డీజీపీ

డీజీపీగా పదవీ విరమణ చేసిన బి. శివధర్ రెడ్డికి నూతన డీజీపీ సీవీ ఆనంద్ అభినందనలు తెలిపారు. కార్యనిర్వహణలో ఆయన శక్తిసామర్థ్యాలను ప్రశంసించారు. 32 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో శివధర్ రెడ్డి ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలను సీవీ ఆనంద్ గారు కొనియాడారు. 


ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో నక్సలిజం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తూ, అనేక ఎన్‌కౌంటర్లు, నక్సలైట్ల లొంగుబాటులో ఆయన పోషించిన పాత్రను గుర్తు చేశారు. 'ఆపరేషన్ కగార్' వంటి కీలక ఆపరేషన్లను విజయవంతంగా అమలు చేసి, పెద్ద ఎత్తున ఆయుధాల సీజింగ్, మావోయిస్టుల లొంగుబాటుకు కారకులయ్యారని ప్రశంసించారు. కేవలం శాంతిభద్రతలే కాకుండా, పోలీస్ కుటుంబాల సంక్షేమం కోసం ఆయన అమలు చేసిన పథకాలు ఎంతో మేలు చేశాయని పేర్కొన్నారు.


గతంలో ఉన్న కమ్యూనల్ సమస్యలు, నక్సలిజం స్థానంలో ఇప్పుడు సరికొత్త సవాళ్లు వచ్చి చేరాయని సీవీ ఆనంద్ తెలిపారు. వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ, నార్కోటిక్స్ (డ్రగ్స్), సైబర్ క్రైమ్ వంటి సమస్యలు విపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేరాల స్వరూపం మారుతున్న తరుణంలో, పోలీస్ శాఖ కూడా తన పనితీరును మార్చుకోవాలని అన్నారు.


గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వంటి విభాగాల పనితీరును మరింత మెరుగుపరచడమే తన లక్ష్యమని నూతన డీజీపీ స్పష్టం చేశారు. 2016 నుండి తనతో కలిసి పనిచేసిన అధికారుల అనుభవాన్ని ఉపయోగించుకుంటూ, పూర్తి స్థాయి టీమ్ వర్క్‌తో ముందుకు సాగుదామని అధికారులను కోరారు. ప్రజలకు పోలీస్ డిపార్ట్‌మెంట్ మీద ఉన్న నమ్మకాన్ని కాపాడటమే పరమావధిగా అందరూ తమ ఆలోచనలను పంచుకోవాలని సూచించారు.
Go Back to Shorts
CV Anand
TG DGP
Sivadhar Reddy

More Telugu News