ఇదేం వింత వ్యూహం?.. ఐపీఎల్ చరిత్రలోనే శార్దూల్ లాంటి ఇంపాక్ట్ ప్లేయరే లేడు!

Shardul Thakur Becomes The First Impact Player In Ipl History Who Neither Batted Nor Bowled
  • సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయిన ముంబై ఇండియన్స్
  • ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి బ్యాటింగ్, బౌలింగ్ చేయని శార్దూల్ ఠాకూర్
  • ముంబై జట్టు వ్యూహంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ
  • రియాన్ రికిల్టన్ అద్భుత సెంచరీ చేసినా ఫలితం శూన్యం
  • హెడ్, అభిషేక్, క్లాసెన్‌ మెరుపులతో హైదరాబాద్ సునాయాస విజయం
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. సొంత మైదానం వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయి, ఈ సీజన్‌లో ఆరో ఓటమిని నమోదు చేసింది. అయితే, ఈ ఓటమి కంటే ఎక్కువగా ముంబై జట్టు తీసుకున్న ఓ విచిత్ర నిర్ణయంపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు విల్ జాక్స్ (46), రియాన్ రికిల్టన్ తొలి వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం అందించారు. ముఖ్యంగా రికిల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగి, కేవలం 55 బంతుల్లో 123 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోరు చేసింది. ‌

అయితే, భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏమాత్రం తగ్గలేదు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 76), అభిషేక్ శర్మ (24 బంతుల్లో 45) కేవలం 8.4 ఓవర్లలోనే 129 పరుగుల భాగస్వామ్యంతో విజయానికి బలమైన పునాది వేశారు. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ (22 బంతుల్లో 50), సలీల్ అరోరా (10 బంతుల్లో 30*) మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్ సునాయాసంగా విజయం సాధించింది.

ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి బ్యాటింగ్, బౌలింగ్ చేయని శార్దూల్!
మ్యాచ్ ముగిసిన తర్వాత "ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన శార్దూల్ ఠాకూర్‌తో బ్యాటింగ్ గానీ, బౌలింగ్ గానీ ఎందుకు చేయించలేదు?" అనే ప్రశ్న 'ఎక్స్‌' (ట్విట్టర్)లో వైరల్‌గా మారింది. ఐపీఎల్ చరిత్రలోనే బహుశా ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి బ్యాటింగ్, బౌలింగ్ చేయని మొదటి ఆటగాడు శార్దూల్ కావచ్చని విశ్లేషకులు, అభిమానులు చర్చిస్తున్నారు. ముంబై యాజమాన్యం అనుసరించిన ఈ వింత వ్యూహంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు శార్దూల్‌ను జట్టులోకి తీసుకురావడం వెనుక వ్యూహం ఏంటో అంతుచిక్కక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.
Go Back to Shorts
Shardul Thakur
Impact Player
Ipl History
Mumbai Indians
IPL 2026
MI vs SRH

More Telugu News