ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో.. నేడో రేపో ఒప్పందం

Hyderabad Metro Transfer to Government Today or Tomorrow
  • ప్రభుత్వపరం కానున్న హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 
  • వాటా కొనుగోలు ఒప్పందంపై త్వరలో సంతకాలు
  • సీఎం రేవంత్, ఎల్ అండ్ టీ ఛైర్మన్ సమక్షంలో ఒప్పందం
  • రూ.13,615 కోట్ల అప్పును టేకోవర్ చేయనున్న ప్రభుత్వం
  • మెట్రో ఫేజ్-1లో పీపీపీ విధానానికి ముగింపు
హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వపరం కానుంది. ప్రైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ) నడుస్తున్న ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇందుకు సంబంధించి వాటా కొనుగోలు ఒప్పందం (ఎస్‌పీఏ)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్.సుబ్రమణ్యం సమక్షంలో సంతకాలు జరగనున్నాయి.

మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన సమావేశమైన హెచ్‌ఎంఆర్‌ఎల్ బోర్డు.. ఈ స్వాధీన ప్రక్రియకు ఆమోదముద్ర వేసింది. ఒప్పందంపై సంతకాల కోసం ఎల్ అండ్ టీ ఛైర్మన్ హైదరాబాద్ పర్యటన కూడా ఖరారైంది. ఈ నెల 30వ తేదీ గడువు సమీపిస్తుండటంతో అధికారులు ఒప్పంద పత్రాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఈ ఒప్పందం ప్రకారం ఎల్ అండ్ టీ మెట్రోరైలు లిమిటెడ్‌కు ఉన్న రూ.13,615 కోట్ల అప్పును ప్రభుత్వం టేకోవర్ చేస్తుంది. ఈ మొత్తాన్ని ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ) నుంచి తక్కువ వడ్డీకి రుణంగా తీసుకుని రీషెడ్యూల్ చేయనుంది. దీంతో పాటు హెచ్‌ఎండీఏ నుంచి రూ.1,385 కోట్లను ఈక్విటీగా ఎల్ అండ్ టీకి చెల్లించనుంది.

వాస్తవానికి మార్చి 31 నాటికే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నా, ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి రుణం మంజూరు ఆలస్యం కావడంతో గడువును ఏప్రిల్ 30కి పొడిగించారు. బుధ లేదా గురువారం ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందంతో మెట్రో మొదటి దశలో పీపీపీ విధానం ముగిసి, అది ప్రభుత్వ ఆస్తిగా మారనుంది.
Go Back to Shorts
Hyderabad Metro
Telangana Government
L&T
Hyderabad
Revanth Reddy

More Telugu News