రెండేళ్లలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు మోక్షం: మంత్రి నిమ్మల

రెండేళ్లలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు మోక్షం: మంత్రి నిమ్మల

AP Irrigation Minister Nimmala Ramanaidu on Uttarandra Projects
  • రెండేళ్లలో ఉత్తరాంధ్రలోని 11 ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న మంత్రి నిమ్మల
  • ఈ ప్రాజెక్టుల కోసం రూ.2వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడి
  • వీటి ద్వారా 2.69 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందుతుందన్న మంత్రి
  • నేరడి బ్యారేజీ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయన్న మంత్రి
ఉత్తరాంధ్ర ప్రాంతంలోని 11 కీలక సాగునీటి ప్రాజెక్టులను రానున్న రెండేళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. ఇందుకోసం రూ.2 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి నిన్న అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి ఈ వివరాలు తెలిపారు.

ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఉత్తరాంధ్రలో కొత్తగా 2.69 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుండగా, మరో 2.49 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని వివరించారు. కరవు పీడిత ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూరే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక కృషితో వంశధార ట్రైబ్యునల్-2021 తీర్పు గెజిట్‌లో ప్రచురితమైందని మంత్రి తెలిపారు. "కేంద్ర మంత్రులు, జలశక్తి అధికారులతో సీఎం తరచూ సంప్రదింపులు జరిపి ఇది సాధించారు. ఫలితంగా శ్రీకాకుళం జిల్లాలో నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి" అని నిమ్మల పేర్కొన్నారు.

గత వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటి రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేలా పనిచేస్తామని స్పష్టం చేశారు.

 
Advertisement
Nimmala Ramanaidu
Irrigation Projects
Uttarandra

More Telugu News