శుక్రాచార్యుడు ఫాంహౌస్ లో పడుకున్నాడు.. మారీచుడు, సుబాహుడు జనంలో తిరుగుతున్నారు: రేవంత్ రెడ్డి సెటైర్లు

Revanth Reddy satires on opposition leaders at Future City Event
  • ఫ్యూచర్‌ సిటీలో సీపీ భవనానికి సీఎం రేవంత్‌ శంకుస్థాపన
  • ప్రపంచస్థాయి నగరంగా ఫ్యూచర్‌ సిటీని అభివృద్ధి చేస్తామని హామీ
  • రైతులు భూములిచ్చి సహకరించాలని విజ్ఞప్తి
  • ప్రతిపక్షాల మాటలు పట్టించుకోనని వ్యాఖ్య
ప్రజలను భాగస్వాములను చేస్తూ ఫ్యూచర్‌ సిటీని అధునాతన నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే సిటీ నిర్మాణం సాధ్యమవుతుందని సీపీ భవన శంకుస్థాపన కార్యక్రమంలో స్పష్టం చేశారు. ఈ నగరం భావితరాలకు వరంగా మారుతుందని పేర్కొన్నారు. అయితే, ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం అంత సులభం కాదని వివరించారు. ఈ సందర్భంగా విపక్ష నేతలపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

కొంత మంది ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం విషయంలో తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని రేవంత్‌ అన్నారు. ‘‘మీరు ఏడుస్తూనే ఉండండి.. నేను చేసుకుంటూ పోతూనే ఉంటా’’ అంటూ తనదైన శైలిలో ప్రతిపక్షాలకు చురకలు అంటించారు. శుక్రాచార్యుడు ఫాంహౌస్ లో పడుకున్నాడని, మారీచుడు, సుబాహుడు జనంలో తిరుగుతున్నారంటూ బీఆర్‌ఎస్‌ అగ్రనేతలను ఉద్దేశించి అన్నారు.

టోక్యో, సియోల్‌, సింగపూర్‌ వంటి ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడేలా ఫ్యూచర్‌ సిటీని నిర్మించడమే తమ లక్ష్యమని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఆ దిశగా రోడ్లు సహా అన్ని మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా జూన్‌ 2లోపు ఫ్యూచర్‌ సిటీ భవన నిర్మాణాన్ని పూర్తిచేస్తామని తెలిపారు.

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు రాష్ట్రానికే తలమానికం అని రేవంత్‌ రెడ్డి గుర్తుచేశారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీలో హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీ సేవలు ప్రపంచవ్యాప్తంగా అందాయని తెలిపారు. ఐటీ, డిఫెన్స్‌, ఫార్మా ఎగుమతుల్లో నగరం చాలా అభివృద్ధి చెందిందన్నారు. రానున్న రోజుల్లో భాగ్యనగరానికి మరిన్ని పెట్టుబడులు రానున్నాయని వెల్లడించారు. 

ఫ్యూచర్‌ సిటీ కోసం రైతులు భూములిచ్చి సహకరించాలని రేవంత్‌ విజ్ఞప్తి చేశారు. అందరికీ కచ్చితంగా పరిహారం అందిస్తామన్నారు. అధికారులు వారికి వివరించి నచ్చజెప్పాలన్నారు. అప్పుడే ప్రపంచస్థాయి నగరానికి పునాదులు పడతాయని పేర్కొన్నారు. 

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే పూర్తయితే హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు 70-80 కి.మీ దూరం తగ్గుతుందన్నారు. కేంద్రం తీసుకురానున్న ఏడు హైస్పీడ్‌ రైళ్లలో మూడు రాష్ట్రం నుంచి వెళుతున్నాయని సీఎం తెలిపారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌, శంషాబాద్‌ నుంచి ముంబై, శంషాబాద్‌ నుంచి చెన్నై వరకు బుల్లెట్‌ ట్రైన్లు రాబోతున్నాయని పేర్కొన్నారు. 

Go Back to Shorts
Revanth Reddy
Future City
Hyderabad
Congress
BRS
BJP
Telangana

More Telugu News