లొంగిపోయిన మావోయిస్టులకు ప్రత్యేక డ్రెస్సులు, ఉద్యోగాలు
- లొంగిపోయిన మావోలను ప్రధాన స్రవంతిలోకి!
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- లొంగిపోయిన మావోలకు టూరిజం గైడ్స్ గా ఉద్యోగాలు
- కాసేపట్లో నియామకపత్రాలను అందించనున్న రేవంత్ రెడ్డి
సమాజానికి దూరంగా అడవుల్లో గడిపిన మాజీ మావోయిస్టులను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లొంగిపోయిన 20 మంది మాజీ మావోయిస్టులకు టూరిజం గైడ్స్ గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ముఖ్యంగా భద్రాచలం, ములుగు వంటి అటవీ ప్రాంతాల్లోని భౌగోళిక పరిస్థితులపై వారికి ఉన్న పట్టును ప్రభుత్వం నిర్మాణాత్మకంగా వాడుకోవాలని నిర్ణయించింది. అడవి మార్గాలు, అక్కడి విశేషాల గురించి వారికి ఉన్న లోతైన అవగాహన పర్యాటకులకు ఎంతో మేలు చేస్తుంది. ఈ ఉద్యోగాల కోసం వీరికి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ), పర్యాటక శాఖ సంయుక్తంగా నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీరికి ప్రత్యేక యూనిఫామ్ కూడా కేటాయించనున్నారు.
పునరావాసం అంటే కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాకుండా, ఇలా వారి నైపుణ్యానికి తగిన గౌరవప్రదమైన ఉపాధిని కల్పించడం అనేది ఇతర మావోయిస్టులను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో వీరికి నియామకపత్రాలను అందించనున్నారు.