అక్కడ సిమ్ కొంటే లీటర్ పెట్రోల్ ఫ్రీ.. ఎయిర్‌టెల్ వినూత్న ఆఫర్!
- పెట్రోల్ కొరతను క్యాష్ చేసుకుంటున్న ఎయిర్‌టెల్
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వినూత్న ఆఫర్
- కొత్త సిమ్ తీసుకుంటే లీటర్ పెట్రోల్ ఉచితం
- నెటిజన్లను ఆకట్టుకుంటున్న మార్కెటింగ్ ట్రిక్
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కృత్రిమ ఇంధన కొరత కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా పెట్రోల్ బంకుల వద్ద "నో స్టాక్" బోర్డులు దర్శనమిస్తుండగా, తెరిచి ఉన్న చోట్ల జనాలు బారులు తీరుతున్నారు. ఈ సంక్షోభాన్ని గమనించిన ఎయిర్‌టెల్ ప్రతినిధులు, దీన్నే ఒక మార్కెటింగ్ అవకాశంగా మలుచుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఈ ఆఫర్‌ను ప్రారంభించారు.
ఎయిర్‌టెల్‌లో కొత్త కనెక్షన్ తీసుకున్నా లేదా ఇతర నెట్‌వర్క్‌ల నుంచి పోర్ట్ అయినా ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రతినిధులు చెబుతున్నారు. రూ.350 రీచార్జ్‌తో పాటు ఒక లీటర్ పెట్రోల్‌ను ఉచితంగా అందిస్తున్నారు. కస్టమర్లను పెంచుకోవడం కోసం ఎయిర్‌టెల్ అనుసరిస్తున్న ఈ ట్రిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వినూత్న ఆలోచనను ప్రశంసిస్తున్నారు.