పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాల రోజు సెలవు: పోలీసులకు తెలంగాణ డీజీపీ శుభవార్త

  • ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ పోలీసు శాఖ
  • నిత్యం ఒత్తిడిలో పనిచేస్తూ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేకపోతున్నారన్న డీజీపీ
  • ఆధారాలు, దరఖాస్తు ఆధారంగా సెలవులు మంజూరు
తెలంగాణ రాష్ట్ర పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఇక నుంచి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాల రోజున ప్రత్యేక సెలవు తీసుకోచ్చని తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నిత్యం విధి నిర్వహణలో ఒత్తిడికి లోనయ్యే పోలీసు సిబ్బందికి ఈ ప్రత్యేక సెలవు గొప్ప ఉపశమనంగా చెప్పవచ్చు.

పోలీసులు నిత్యం ఒత్తిడిలో పనిచేస్తూ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేకపోతున్నారని డీజీపీ తెలిపారు. వారికి మానసిక ఉల్లాసంతో పాటు కుటుంబ బంధాలు బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అత్యవసర పరిస్థితులు మినహా సిబ్బందికి సెలవులు మంజూరు చేయాలని ఆదేశించారు. ఆధారాలు, దరఖాస్తు ఆధారంగా సెలవులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.

కఠినమైన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తూ, సమాజ రక్షణ కోసం తమ వ్యక్తిగత జీవితాన్ని, సంతోషాన్ని పోలీసులు త్యాగం చేస్తున్నారని తెలిపారు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని అన్నారు. సిబ్బందిలో పని, వ్యక్తిగత జీవితం సమతుల్యతను పెంపొందించడంతో పాటు, వృత్తి పట్ల వారి అంకితభావానికి గుర్తుగా ఈ గౌరవం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో డీజీపీ పేర్కొన్నారు.

telangana DGP
Telangana DGP to Police
Birth Day holiday
Marriage day holiday

More Telugu News