చేసేదేమీ లేక 'గూగుల్' క్రెడిట్ చోరీకి యత్నిస్తున్నారు: పంచుమర్తి అనురాధ

  • విశాఖకు గూగుల్ రావడం వెనుక లోకేష్ కృషి ఉందన్న అనురాధ
  • గూగుల్ ప్రాజెక్టును వైసీపీ అడ్డుకోవాలని చూసిందని ఆరోపణ
  • ఇప్పుడు క్రెడిట్ దొంగిలించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం 
  • వాళ్లు గంజాయి తెస్తే, తాము గూగుల్ తెచ్చామన్న అనురాధ
  • మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై ప్రశ్నల వర్షం
విశాఖపట్నంకు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ గూగుల్ ఏఐ హబ్ రావడం వెనుక ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అవిరళ కృషి ఉందని, అయితే ఇప్పుడు ఆ క్రెడిట్‌ను దొంగిలించేందుకు వైసీపీ నీచంగా ప్రయత్నిస్తోందని ఏపీ శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకప్పుడు గూగుల్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు కోర్టుల్లో పిటిషన్లు వేసి, వ్యతిరేకించిన వారే నేడు సిగ్గులేకుండా క్రెడిట్ కోసం పాకులాడుతున్నారని, 'క్రెడిట్ చోరీ' వైసీపీ సిద్ధాంతమని ఆమె విరుచుకుపడ్డారు. సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ, "ఉత్తరాంధ్రను ఆర్థికంగా, సాంకేతికంగా అగ్రగామిగా నిలపాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం. 2014లోనే విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చేందుకు ఆయన పునాదులు వేశారు. ఆయన కృషితో ఎన్నో అంతర్జాతీయ సంస్థలు తరలివచ్చి, వేలాది మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయి. కానీ, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర అభివృద్ధి పూర్తిగా స్తంభించింది. ప్రశాంతమైన విశాఖ నగరాన్ని గంజాయి, భూకబ్జాలు, కిడ్నాపులు, లిక్కర్ మాఫియాలకు అడ్డాగా మార్చారు. ప్రజలు భయంతో బతికే దుస్థితి కల్పించారు. ఐదేళ్ల పాటు విశాఖను సర్వనాశనం చేశారు" అని ఆవేదన వ్యక్తం చేశారు.

యువనేత కృషితోనే గూగుల్ సాకారం

"2024లో చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాక 'విజన్ 2047'లో భాగంగా విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే పనికి శ్రీకారం చుట్టారు. ఐటీ మంత్రి నారా లోకేష్, పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపి, గూగుల్ డేటా సెంటర్‌ను విశాఖకు తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, 610 ఎకరాల భూమి కేటాయించి, శంకుస్థాపనకు సిద్ధం చేయడం 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'కు నిదర్శనం. ఈ ప్రాజెక్టుతో విశాఖ 1 గిగావాట్ డేటా హబ్‌గా, ప్రపంచానికి డేటా సేవలు అందించే కేంద్రంగా మారనుంది. ఏఐ, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.80 లక్షల ఉద్యోగాలు రానున్నాయి" అని అనురాధ వివరించారు.

అప్పుడు అడ్డుకొని, ఇప్పుడు క్రెడిట్ అడుగుతారా?

గూగుల్ ప్రాజెక్టును ఆపేందుకు గతంలో వైసీపీ విశ్వప్రయత్నాలు చేసిందని అనురాధ ఆరోపించారు. "భూసేకరణను అడ్డుకోవాలని, రాయితీలు ఇవ్వొద్దని కోర్టుల్లో కేసులు వేశారు. విశాఖలో వచ్చేది గూగుల్ కాదని, అదొక గిడ్డంగి అని తక్కువ చేసి మాట్లాడారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యతని, రాయితీలు ఇవ్వడంలో తప్పేంటని కోర్టు కూడా వైసీపీ నేతలకు మొట్టికాయలు వేసింది. అన్ని అడ్డంకులు దాటుకొని వస్తున్న ఈ ప్రాజెక్టు క్రెడిట్ ఇప్పుడు వాళ్లెలా తీసుకుంటారు?" అని ఆమె నిలదీశారు.

గుడివాడ అమర్‌నాథ్‌కు సూటి ప్రశ్నలు

మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను ఉద్దేశిస్తూ అనురాధ పలు ప్రశ్నలు సంధించారు. "అమర్‌నాథ్, మీ ఐదేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమనైనా తెచ్చారా? చంద్రబాబు తెచ్చిన వాటిని తరిమికొట్టిన మాట వాస్తవం కాదా? విశాఖను గంజాయి అడ్డాగా మార్చలేదా? మీ నాయకుడి విలాసాల కోసం రూ.600 కోట్లతో రుషికొండను బోడిగుండు చేసి ప్యాలెస్ కట్టలేదా? 22ఏ భూములను కబ్జా చేసి ఉత్తరాంధ్రను దోచుకోలేదా? భూ వివాదంలో మీ ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేసిన ఘటన మర్చిపోయారా?" అని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం నారా లోకేష్ 5 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో పనిచేస్తున్నారని, ఈ అభివృద్ధి యాత్రను ఇక ఎవరూ ఆపలేరని ఆమె స్పష్టం చేశారు.

Google In Visakha
Panchumarti Anuradha
Nara Lokesh
TDP
YCP
Andhra Pradesh

More Telugu News