ఫలించిన చర్చలు.. ముగిసిన ఆర్టీసీ సమ్మె.. రోడ్డెక్కిన బస్సులు

TGSRTC Strike Ends Buses Back on Roads
  • ఫలప్రదంగా ముగిసిన ఆర్టీసీ జేఏసీ, ప్రభుత్వ చర్చలు
  • మూడు రోజులుగా కొనసాగుతున్న సమ్మె విరమణ
  • కార్మికులకు 11 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం
  • ప్రభుత్వంలో విలీనంపై కమిటీ.. యూనియన్ ఎన్నికలకు హామీ
  • ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
తెలంగాణలో మూడు రోజులుగా ప్రజా రవాణాను స్తంభింపజేసిన టీజీఎస్ఆర్టీసీ సమ్మెకు శుభం కార్డు పడింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల ఉప సంఘంతో ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. కార్మికుల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో, ఏప్రిల్ 22న ప్రారంభమైన నిరవధిక సమ్మె ముగిసింది. ప్రభుత్వ హామీతో ఇవాళ ఉదయం తొలి షిఫ్ట్ నుంచే బస్సులు రోడ్డెక్కాయి.

తెలంగాణ సెక్రటేరియట్‌లో శుక్రవారం అర్ధరాత్రి వరకు మంత్రుల బృందంతో జేఏసీ నాయకులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తమ 32 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ముఖ్యంగా 2021, 2025 సంవత్సరాలకు సంబంధించిన వేతన సవరణలు (పీఆర్సీ) అమలు చేయాలని, 30 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని పట్టుబట్టారు. కార్మికుల డిమాండ్లను సావధానంగా విన్న ప్రభుత్వం, వాటి పరిష్కారానికి అంగీకారం తెలిపింది.

చర్చల అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. కార్మికులకు 11 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. అలాగే, ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వ విలీనం అంశంపై అధికారులు, కార్మిక సంఘాల నేతలతో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతో పాటు, కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలను కూడా త్వరలోనే నిర్వహిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.

ఆర్టీసీ అనేది ప్రభుత్వంలో అంతర్భాగమని, కార్మికుల సంక్షేమానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కార్మికులను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పెద్దల నుంచి రాతపూర్వక హామీ లభించడంతో జేఏసీ నాయకులు సమ్మెను విరమించారు. దీంతో మూడు రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Go Back to Shorts
TGSRTC
RTC strike
Telangana RTC strike
Mallu Bhatti Vikramarka
Telangana government
RTC employees
Wage revision
Bus services
Trade union
Public transport

More Telugu News