ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్... ఇక సెకండియర్ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్‌మెంట్!

AP Inter Board Announces Improvement Option for Second Year Students
  • ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ అవకాశం
  • పాసైన, ఫెయిలైన విద్యార్థులకూ ఈ సదుపాయం వర్తింపు
  • రెండు పరీక్షల్లో ఉత్తమ మార్కులను పరిగణనలోకి తీసుకోనున్న బోర్డు
  • ఏప్రిల్ 20 నుంచి 27 వరకు ఫీజుల చెల్లింపు గడువు
  • ప్రాక్టికల్ పరీక్షలకు ఇంప్రూవ్‌మెంట్ లేదని స్పష్టం
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇప్పటివరకు మొదటి సంవత్సరం విద్యార్థులకే పరిమితమైన ఇంప్రూవ్‌మెంట్ అవకాశాన్ని ఇకపై రెండో సంవత్సరం విద్యార్థులకు కూడా వర్తింపజేస్తూ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మే 2026లో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయం ఈ మేరకు ఏప్రిల్ 18న సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. మార్చి 2026లో జరిగిన ఇంటర్ వార్షిక పరీక్షల్లో సెకండియర్‌లో ఉత్తీర్ణులైన లేదా ఫెయిలైన విద్యార్థులు సైతం, తాము పాసైన సబ్జెక్టులలో మార్కులు పెంచుకునేందుకు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసుకోవచ్చు. వార్షిక పరీక్షలు, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల్లో ఏ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వస్తే వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. ఫస్టియర్ విద్యార్థులకు ఇప్పటికే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.

అయితే, ప్రాక్టికల్ పరీక్షలకు ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్ అవకాశం లేదని బోర్డు స్పష్టం చేసింది. ఫెయిలైన సబ్జెక్టులను మాత్రం విద్యార్థులు పాసయ్యే వరకు ఎన్నిసార్లయినా రాసుకోవచ్చు. ఇంప్రూవ్‌మెంట్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.160 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా సాధారణ పరీక్ష ఫీజు (ఒక సంవత్సరానికి రూ.600, రెండు సంవత్సరాలకు కలిపి రూ.1200) చెల్లించాలి.

ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మార్చి 2026 పరీక్షల రిజిస్ట్రేషన్ నంబర్‌నే ఉపయోగించాలని బోర్డు సూచించింది. పరీక్ష మరియు ఇంప్రూవ్‌మెంట్ ఫీజులను ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 27 వరకు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి పి. రంజిత్ బాషా ఐఏఎస్ ఓ ప్రకటనలో తెలిపారు.
Go Back to Shorts
AP Inter Board
Inter Exams
Improvement Exam
AP Intermediate
Board of Intermediate Education
Ranjit Basha IAS
Andhra Pradesh Education
AP Inter Second Year
Intermediate Public Advanced Supplementary Exams

More Telugu News