ప్రకాశ్ రాజ్ కు లీగల్ నోటీసులు
- రామ లక్ష్మణులపై ప్రకాశ్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు
- లీగల్ నోటీసులు పంపిన భానుప్రకాశ్ రెడ్డి
- క్షమాపణ చెప్పకపోతే రూ. 100 కోట్లకు పరువునష్టం దావా వేస్తానని హెచ్చరిక
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనకు తాజాగా లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తరఫు న్యాయవాది ఈ నోటీసులను పంపారు. ఇటీవల ప్రకాశ్ రాజ్ రామలక్ష్మణులపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా ఉన్నాయని, అవి కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచాయని నోటీసులో పేర్కొన్నారు.
తమ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ నిర్ణీత సమయంలోగా స్పందించకపోయినా లేదా క్షమాపణలు చెప్పకపోయినా.. రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేస్తామని హెచ్చరించారు. గతంలో కూడా తిరుమల లడ్డూ వివాదం సమయంలో ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా కోర్టు నోటీసులు రావడంతో దీన్ని ఆయన ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.