'ఇది శిక్షా?' అంటూ డీలిమిటేషన్‌పై శశి థరూర్ ధ్వజం

Shashi Tharoor criticizes delimitation says injustice to South
  • జనాభా నియంత్రణలో విఫలమైన రాష్ట్రాలకు రివార్డు
  • సమర్థంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష
  • డీలిమిటేషన్ ఓ రాజకీయ ఉచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ లోక్‌సభలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను రాజకీయంగా శిక్షిస్తూ, విఫలమైన రాష్ట్రాలకు బహుమతి ఇవ్వడమే డీలిమిటేషన్ ఉద్దేశమా? అని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు జనాభా నియంత్రణ కోసం కృషి చేసి, విజయం సాధించిన దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు తమ ఎంపీ సీట్లను కోల్పోవడం ద్వారా శిక్ష అనుభవించాలా? అని థరూర్ ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో, జనాభాను అదుపు చేయడంలో వెనుకబడిన ఉత్తరాది రాష్ట్రాలకు అదనపు సీట్లు కేటాయించడం వారి వైఫల్యానికి రివార్డు ఇవ్వడం లాంటిదేనని ఆయన విమర్శించారు. ఈ ప్రక్రియ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని హెచ్చరించారు.

మహిళా రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని థరూర్ ఒక ‘రాజకీయ ఉచ్చు’గా అభివర్ణించారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళల ఆకాంక్షలను రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారని, రిజర్వేషన్లను తక్షణమే ఎందుకు అమలు చేయలేరని నిలదీశారు.

కేవలం జనాభానే ప్రాతిపదికగా తీసుకోకుండా విద్య, ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని పునర్విభజన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య రాజకీయ సమతుల్యత దెబ్బతిని దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు.
Go Back to Shorts
Shashi Tharoor
delimitation
South India
population control
parliament
political reward
federal spirit
women reservation
political balance

More Telugu News