బలవంతపు భూసేకరణ ఆపకపోతే ఉద్యమం ఉద్ధృతం: వికారాబాద్‌లో కల్వకుంట్ల కవిత గర్జన

  • పరిగి ప్రాంత రైతుల నుంచి సాగు భూములను లాక్కుంటున్నారంటూ కవిత ధర్నా
  • అన్నదాతల పొట్ట కొట్టడం అన్యాయమని వ్యాఖ్య
  • రైతుల సమ్మతి లేకుండా ఒక్క ఎకరా భూమి కూడా తీసుకోవడానికి వీల్లేదన్న కవిత

పారిశ్రామికీకరణ పేరుతో పరిగి ప్రాంత రైతుల నుంచి బలవంతంగా సాగు భూములను లాక్కుంటున్నారంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యక్ష పోరాటానికి దిగారు. వికారాబాద్ ఆర్‌డీవో కార్యాలయం వద్ద వందలాది మంది రైతులతో కలిసి ఆమె భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, భూసేకరణ నోటిఫికేషన్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


తాతల కాలం నాటి సారవంతమైన భూములను నమ్ముకుని బతుకుతున్న అన్నదాతల పొట్ట కొట్టడం అన్యాయమని కవిత ఈ సందర్భంగా మండిపడ్డారు. రైతుల సమ్మతి లేకుండా ఏ ఒక్క ఎకరా భూమిని తీసుకోవడానికి వీల్లేదని, ప్రభుత్వం తన మొండివైఖరిని వీడకపోతే ఈ పోరాటాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. పారిశ్రామికీకరణ ముసుగులో భూసేకరణకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కవిత పిలుపుతో ఈ ఆందోళనలో స్థానిక నాయకులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో వికారాబాద్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని గమనించిన పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. కవిత రాకతో ఈ భూపోరాటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.


Kalvakuntla Kavitha
Vikarabad
Telangana Jagruthi
Land Acquisition
Farmers Protest
Parigi
RDO Office
Telangana Politics
Rythu
Cultivated Land

More Telugu News