వివేకా హత్య కేసులో సునీత పిటిషన్: కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశం
- వివేకా హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ
- మరింత దర్యాప్తు కోరుతూ సునీతా రెడ్డి పిటిషన్
- కౌంటర్ దాఖలుకు రెండు వారాల సమయం కోరిన సీబీఐ
- ఈ నెల 27లోపు కౌంటర్ వేయాలని సీబీఐకి కోర్టు ఆదేశం
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తీరుపై సునీత అసంతృప్తి వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తు సంస్థ పలు అనుమానాస్పద, సందేహాస్పద అంశాలను విస్మరించిందని, కేసులో లోతైన విచారణ జరిపేలా సీబీఐని ఆదేశించాలని ఆమె తన పిటిషన్‌లో అభ్యర్థించారు.
సోమవారం ఈ పిటిషన్ విచారణకు రాగా, సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించేందుకు గడువు కావాలని కోరారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం, ఈ నెల 27లోపు కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను అదే తేదీకి వాయిదా వేసింది.
సీబీఐ కౌంటర్ దాఖలు చేశాక, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తదుపరి దర్యాప్తుపై హైకోర్టు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఈ కేసులో న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.