కొత్త పెళ్లికూతురు రష్మిక పుట్టినరోజు.. ఖరీదైన బంగ్లాను బహూకరించిన తండ్రి మదన్ మందన్న
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఈ నెల 5న తన 30వ పుట్టినరోజును జరుపుకుంది. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో నటుడు విజయ్ దేవరకొండతో అత్యంత వైభవంగా వివాహం జరిగిన తర్వాత, ఈ జంట రష్మిక సొంత ఊరైన కర్ణాటకలోని విరాజ్పేటను సందర్శించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి రష్మిక తన బర్త్‌డే వేడుకలను ఎంతో ఘనంగా, మనసుకు నచ్చేలా జరుపుకుంది.
ఈ పుట్టినరోజు వేడుకలో రష్మిక తండ్రి మదన్ మందన్న ఆమెకు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఇచ్చారు. విరాజ్‌పేట సమీపంలో 'సెరినిటీ' అని పేరు పెట్టిన ఒక విలాసవంతమైన బంగ్లాను ఆమెకు బహుమతిగా అందించారు. ఇది కేవలం ఒక ఆస్తి మాత్రమే కాకుండా, నిత్యం బిజీగా ఉండే రష్మిక ప్రశాంతంగా గడపడానికి, ప్రకృతి ఒడిలో సేద తీరడానికి ఒక ప్రత్యేక నిలయంగా ఉంటుందని సమాచారం. తన తండ్రి ఇచ్చిన ఈ ఎమోషనల్ గిఫ్ట్ చూసి రష్మిక ఎంతో భావోద్వేగానికి గురయింది.
సోషల్ మీడియా వేదికగా రష్మిక ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ.. "ఈసారి నా 30వ పుట్టినరోజు చాలా భిన్నంగా, ప్రత్యేకంగా సాగింది" అని రాసుకొచ్చింది. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, తాను చదువుకున్న స్కూల్‌ను సందర్శించడం, పెళ్లికి రాలేకపోయిన బంధువులతో కలిసి విందులో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొంది. ఉదయ్‌పూర్ వేడుకలో ఒకటైన ఈ జంట, ఇప్పుడు రష్మిక పుట్టినరోజును ఇలా కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం అభిమానులను ఎంతగానో అలరిస్తోంది.