లక్నో కొత్త హీరో ముకుల్.. ప్రత్యేకంగా అభినందించిన యజమాని సంజీవ్ గోయెంకా.. ఇదిగో వీడియో!

ఐపీఎల్‌ 2026లో లక్నో సూపర్‌ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) జట్టులో ఒక కొత్త సంచలనం వెలుగులోకి వచ్చాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో (కేకేఆర్‌) జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో యువ బ్యాటర్ ముకుల్ చౌదరి అద్భుత ప్రదర్శనతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముకుల్ కేవలం 27 బంతుల్లో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని మెరుపు ఇన్నింగ్స్ లక్నోను విజయతీరాలకు చేర్చింది.

ముకుల్‌ను తండ్రిలా అభినందించిన యజమాని గోయెంకా
మ్యాచ్ ముగిసిన తర్వాత జట్టు యజమాని సంజీవ్ గోయెంకా మైదానంలోకి వచ్చి ముకుల్ చౌదరిని ప్రత్యేకంగా అభినందించిన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ఒక తండ్రి తన కొడుకు విజయాన్ని చూసి మురిసిపోయినట్లుగా, గోయెంకా ముకుల్ ప్రదర్శనను మెచ్చుకుంటూ అతనితో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విజయం తర్వాత ముకుల్ తన క్రికెట్ ప్రయాణం గురించి, తన నేపథ్యం గురించి పంచుకున్నాడు.

నాన్న కల నెరవేర్చా
"నా కొడుకు క్రికెటర్ అవ్వాలని మా నాన్న తన పెళ్లికి ముందే  కల కన్నారట. నేను 12-13 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడటం ప్రారంభించాను. మొదట్లో మా ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండేది. మా ఊరు ఝున్‌ఝునులో సరైన అకాడమీలు లేకపోవడంతో జైపూర్‌కు వెళ్లాను" అని ముకుల్ తెలిపాడు. టీ20 క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణను గమనించి, తన ఆటను మెరుగుపరుచుకోవడం కోసం గురుగ్రామ్‌లో 3-4 నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నానని వివరించాడు.

ఒత్తిడిని అవకాశంగా చూస్తా
కీలకమైన మ్యాచ్‌లలో ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారని అడగ్గా, "ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది, కానీ దేవుడు మనకు ఈ అవకాశం ఇచ్చాడు. నేను దాన్ని ఒత్తిడిలా కాకుండా ఒక అవకాశంగా చూస్తాను. చివరి వరకు క్రీజులో నిలబడితే జట్టును గెలిపించగలనని నమ్మాను. ఒక్క బంతి నా జోన్‌లోకి వస్తే చాలు, సిక్సర్ కొట్టి మ్యాచ్ ముగించవచ్చని నాకు తెలుసు" అని ముకుల్ ధీమా వ్యక్తం చేశాడు. "చిన్నప్పటి నుంచి నేను హిట్టింగ్ చేస్తూనే ఉన్నాను. బంతి నా ఏరియాలోకి వస్తే, దాని పని పట్టేస్తాను" అంటూ తన సహజమైన పవర్ హిట్టింగ్ సామర్థ్యం గురించి వివరించాడు.

Mukul Choudhary
Lucknow Super Giants
LSG
Sanjiv Goenka
IPL 2026
Kolkata Knight Riders
KKR
Cricket
Indian Premier League
Jhunjhunu

More Telugu News