Amit Jogi: ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడికి జీవిత ఖైదు

Amit Jogi Sentenced to Life in Ramavatar Jaggi Murder Case
షార్ట్స్‌లో చూడండి
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 21 ఏళ్ల నాటి రామావతార్ జగ్గీ హత్య కేసులో ఆయన్ను దోషిగా తేల్చిన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు జీవిత ఖైదు విధించింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన నిర్దోషి తీర్పును కొట్టివేస్తూ ఈ సంచలన తీర్పును వెలువరించింది. అయితే, హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ అమిత్ జోగి సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

2003 జూన్ 4న రాయ్‌పూర్‌లో ఎన్సీపీ నేత రామావతార్ జగ్గీ హత్యకు గురయ్యారు. అప్పట్లో అమిత్ జోగి తండ్రి అజిత్ జోగి ముఖ్యమంత్రిగా ఉన్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు జరిగిన ఈ హత్య, రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో 2007లో ట్రయల్ కోర్టు, సాక్ష్యాలు సరిగా లేవంటూ అమిత్ జోగిని నిర్దోషిగా విడుదల చేసింది. దీనిపై సీబీఐ పట్టువదలకుండా న్యాయపోరాటం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసును పునర్విచారించిన హైకోర్టు, మార్చి 2న అమిత్ జోగిని దోషిగా తేల్చింది.

"ఈ హత్య కుట్రకు అమిత్ జోగినే సూత్రధారి. అప్పటి ముఖ్యమంత్రి కుమారుడిగా ఆయన తన హోదాను ఉపయోగించుకున్నారు" అని హైకోర్టు తన తీర్పులో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ట్రయల్ కోర్టు తీర్పు చట్టవిరుద్ధమని, వాస్తవాలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. మూడు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో అమిత్ జోగి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఏప్రిల్ 20లోగా అప్పీల్ దాఖలు చేయాలని ధర్మాసనం సూచించింది. అన్ని అంశాలను కలిపి విచారించి తుది తీర్పు ఇస్తామని పేర్కొంది. దీంతో ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Go Back to Shorts
Amit Jogi
Chhattisgarh
Ajit Jogi
Ramavatar Jaggi Murder Case
Chhattisgarh High Court
NCP Leader
Raipur
Political Murder
Supreme Court
Life Imprisonment

More Telugu News