Mohammad Bagher Ghalibaf: పాలన మారుస్తామన్నారు, పైలట్ల కోసం వెతుకుతున్నారు.. అమెరికాపై ఇరాన్ స్పీకర్ సెటైర్

Iran Speaker Ghalibaf mocks US after F15E crash
షార్ట్స్‌లో చూడండి
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్ గగనతలంలో అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ యుద్ధ విమానం కూలిపోవడంతో, ఇరాన్ నాయకులు అమెరికాపై మాటల దాడిని ఉద్ధృతం చేశారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖలీబాఫ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఖలీబాఫ్ స్పందిస్తూ.. ‘‘ఇరాన్‌లో పాలన మారుస్తాం అని యుద్ధం మొదలుపెట్టిన అమెరికా, ఇప్పుడు ‘మా పైలట్లు ఎక్కడున్నారో చెప్పండి’ అని అడిగే స్థాయికి దిగజారిపోయింది’’ అంటూ ఎద్దేవా చేశారు. ఇది అమెరికా సాధించిన అద్భుతమైన పురోగతి అని, ట్రంప్ యంత్రాంగంలోని వారు నిజంగా మేధావులని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

నైరుతి ఇరాన్‌లో తమ ఎఫ్-15ఈ యుద్ధ విమానం కూలిపోయినట్లు అమెరికా సైతం ధ్రువీకరించింది. విమానంలోని ఇద్దరు పైలట్ల కోసం గాలింపు చేపట్టగా, ఒకరిని అమెరికా దళాలు రక్షించాయి. రెండో పైలట్ ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. అయితే, ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్న ఒక అమెరికా హెలికాప్టర్‌ను కూడా కూల్చివేసినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. అంతేకాకుండా, అమెరికా పైలట్‌ను పట్టుకున్న వారికి సుమారు 50 లక్షల రూపాయల బహుమతిని ఇరాన్ ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది.

కొన్ని రోజుల క్రితమే ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థ బలహీనపడిందని అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ప్రకటించింది. ఇరాన్‌ను ‘రాతి యుగం’లోకి పంపిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ ప్రకటనల తర్వాత ఇప్పుడు అమెరికా యుద్ధ విమానంతో పాటు, ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ కూడా కూలిపోవడం గమనార్హం. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తత మరింత తీవ్రంగా మారింది. ఫైటర్ జెట్ పైలట్ ఇరాన్ దళాలకు చిక్కితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Go Back to Shorts
Mohammad Bagher Ghalibaf
Iran
America
US Iran tensions
Donald Trump
F-15E fighter jet
Persian Gulf
MQ-9 Reaper drone
Iran US conflict
Middle East crisis

More Telugu News