Kishan Reddy: రాజ్యసభలో పలికింది కిషన్ రెడ్డి, పలికించింది రేవంత్ రెడ్డి: హరీశ్ రావు ట్వీట్

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు రాజ్యసభలో ఆయన పచ్చి అబద్ధాలతో, చరిత్ర వక్రీకరణలతో తన లోపలి వికృతత్వాన్ని బయటపెట్టుకున్నారని విమర్శించారు. సభలో పలికింది కిషన్ రెడ్డే కానీ పలికించింది రేవంత్ రెడ్డి అని ఆరోపించారు.

ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయిన వ్యక్తి కిషన్ రెడ్డి అని ఆరోపించారు. నేడు పార్లమెంట్ సాక్షిగా మరోసారి ద్రోహానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు.

ఏడు మండలాలను ఏపీకి అప్పగించాలనేది విభజన చట్టంలో ఉందని కిషన్ రెడ్డి పేర్కొనడం చారిత్రక అవాస్తవమే కాదు, తెలంగాణకు చేస్తున్న తీరని ద్రోహం కూడా అన్నారు. విభజన చట్టానికి సవరణ తెచ్చి ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలను ఏపీకి కట్టబెట్టింది ముమ్మాటికి బిజెపి ప్రభుత్వమే అన్నారు. ఈ పాపంలో కిషన్ రెడ్డి పాత్ర కూడా ఉందని అన్నారు.

ఉద్యమం సమయంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చి, మీరు చేసిన ద్రోహాన్ని ఎండగట్టిన విషయాన్ని మరిచిపోయారా అని కిషన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. కిషన్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా చరిత్ర వక్రీకరణకు పాల్పడి ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించారని ధ్వజమెత్తారు. ఇది వారి కుట్రకు నిదర్శనమని విమర్శించారు.

రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాన్నే కిషన్ రెడ్డి ప్రస్తావించారు

కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాన్నే ఈరోజు కిషన్ రెడ్డి పార్లమెంట్‌లో చేయడం కాంగ్రెస్, బీజేపీ చీకటి పొత్తుకు సాక్ష్యమని ఆరోపించారు. ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ దశల ఎత్తిపోతల ప్రాజెక్టుగా కాళేశ్వరం నిర్మించడం అబద్దమా? అని నిలదీశారు. 148 మీటర్ల దిగువ ప్రాంతం నుంచి 618 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడం అబద్దమా? ఈరోజు, ఈ నిమిషానికి మండుటెండల్లో సైతం కాళేశ్వరం ప్రాజెక్ట్ కాల్వల ద్వారా జలాలు రైతుల పొలాలకు చేరుతుండటం అబద్దమా? ఏది అబద్దమో కిషన్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు.

పంట పొలాల్లో పారుతున్న కాలేశ్వరం జలాలను చూపించేందుకు నేను సిద్ధం వచ్చేందుకు మీకు దమ్ముందా? అని సవాల్ చేశారు. మీరు క్యాబినెట్ మంత్రిగా ఉండి, ఏ ప్రభుత్వం అయినా ప్రజా ధనంతోనే నిర్మాణాలు చేస్తుందన్న ఇంగితం మరిచి కేసీఆర్ జేబులోంచి డబ్బు ఖర్చు పెట్టారా? అని అడగడం మీ అవివేకానికి, అతి తెలివికి నిదర్శనమని దుయ్యబట్టారు. మీ బీజేపీ ప్రభుత్వం నిర్మిస్తున్న జాతీయ రహదార్లు, ప్రాజెక్టులకు మీ సొంత పైసలు ఖర్చు పెడుతున్నారా? అని ప్రశ్నించారు. ఆ పైసలు దుబాయ్‌లో ముద్రిస్తున్నారా? లేక మీ జేబుల్లో నుండి ఖర్చు చేస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాళేశ్వరం వల్ల ఉపయోగంలేదని కిషన్ రెడ్డి గొంతు చించుకున్నారని ఆరోపించారు. కానీ గతంలో బీజేపీ ప్రభుత్వ పెద్దలు నితిన్ గడ్కరీ నుంచి సీడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ వరకు కాళేశ్వరంపై కురిపించిన ప్రశంసలు అబద్దమా లేక అవివేకమా అని ప్రశ్నించారు.

నిన్నగాక మొన్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా' రిపోర్ట్ ప్రకారం, "2014లో తెలంగాణలో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం ఉంది. 2023 నాటికి ఏకంగా 2.2 కోట్ల ఎకరాలకు పెరిగింది. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ పథకాలే" అని కుండబద్దలు కొట్టిందని అన్నారు. ఇది కిషన్ రెడ్డి కళ్లకు కనబడటం లేదా అని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి చెప్పింది మాత్రమే ఆయన చెవుల్లోకి వెళుతున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. పూటకో తీరు మాట్లాడటం రాజనీతి కాదని హితవు పలికారు.

కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని, తెలంగాణకు నిధులు కేటాయించాలని మా ఎంపీ సురేశ్ రెడ్డి ఎంతో హుందాగా బాధ్యతగా మాట్లాడితే, మీరు దాన్ని సమర్థించకపోగా బాధ్యత మరిచి వ్యర్థ రాజకీయ ప్రేలాపనలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు సభలో పలికింది కిషన్ రెడ్డే కానీ పలికించింది మాత్రం రేవంత్ రెడ్డేనని వ్యాఖ్యానించారు. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి తెలంగాణ వాదాన్ని వినిపించకపోవడం సిగ్గుచేటని హరీశ్ రావు అన్నారు.
Kishan Reddy
Harish Rao
Revanth Reddy
Telangana
Kaleshwaram Project
BJP
Congress
Parliament

More Telugu News