Biker Movie: 'బైకర్' సెన్సార్ టాక్.. రిపోర్ట్ ఏం చెబుతోందంటే..?

యంగ్ హీరో శర్వానంద్ కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నారు. 'నారీ నారీ నడుమ మురారి' వంటి హిట్ తర్వాత ఆయన నటించిన 'బైకర్' చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. 'లూసర్' ఫేమ్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన సెన్సార్ రిపోర్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రిపోర్ట్ ప్రకారం సినిమాకు పాజిటివ్‌ టాక్ వినిపిస్తోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయగా, సినిమా నిడివి 2 గంటల 35 నిమిషాలుగా ఉంది.

భారతదేశపు మొట్టమొదటి పూర్తిస్థాయి మోటోక్రాస్ రేసింగ్ చిత్రంగా 'బైకర్' ప్రచారంలో ఉంది. సెన్సార్ టాక్ ప్రకారం ప్రథమార్ధం ఆకట్టుకునే ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ప్రారంభమవుతుంది. ప్రతి ఫ్రేమ్‌లో శర్వానంద్ నటన ఆకట్టుకుంటుందని, చాలా కాలం తర్వాత డా. రాజశేఖర్ ఈ సినిమాలో అద్భుతమైన పాత్రలో కనిపించారని తెలుస్తోంది. రియల్ రేస్ ట్రాక్‌లపై చిత్రీకరించిన విజువల్స్, ముఖ్యంగా క్లిఫ్ జంప్ సీన్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో వచ్చిన అత్యంత ఉత్కంఠభరితమైన ఇంటర్వెల్స్‌లో ఇది ఒకటిగా నిలుస్తుందని సమాచారం.

ఇక, ద్వితీయార్ధం మొత్తం తండ్రీకొడుకుల మధ్య భావోద్వేగాలపై నడుస్తుందని తెలుస్తోంది. శర్వానంద్, రాజశేఖర్ మధ్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్ గా పతాకస్థాయికి తీసుకెళ్తాయని అంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే రేసింగ్ సీన్ మునుపెన్నడూ చూడని విధంగా గూస్‌బంప్స్ తెప్పిస్తుందని రిపోర్ట్ పేర్కొంటోంది.

నటీనటుల అద్భుతమైన నటనతో పాటు టాప్ క్లాస్ మ్యూజిక్, సౌండ్ డిజైన్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని సెన్సార్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద స్పోర్ట్స్ డ్రామా జానర్‌కు కావాల్సిన అన్ని అంశాలు అత్యుత్తమ నాణ్యతతో ఉన్నాయని తెలుస్తోంది. ఈ పాజిటివ్ టాక్‌తో శర్వానంద్ ఖాతాలో కచ్చితంగా ఓ బ్లాక్‌బస్టర్ పడినట్లేనని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు రాత్రి జరగనున్న ప్రీమియర్ షోల తర్వాత సినిమాపై పూర్తి స్పష్టత రానుంది.
Biker Movie
Sharwanand
Biker Review
Telugu Movie Review
Rajasekhar
UV Creations
Abhilash Reddy
MotoCross Racing
Sports Drama
Telugu Cinema

More Telugu News