Kishan Reddy: అమరావతి చట్టబద్ధత బిల్లుకు తెలంగాణ బీజేపీ మద్దతు: కిషన్ రెడ్డి

అమరావతి చట్టబద్ధత బిల్లుకు తెలంగాణ బీజేపీ మద్దతు తెలుపుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అమరావతి చట్టబద్ధతపై లోక్ సభలో చర్చ జరిగింది. లోక్ సభలో కేంద్ర హోంశాఖ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ఏర్పడిందని ఆయన అన్నారు. కేంద్రంలోని కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించామని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో 1969లో కాంగ్రెస్ పార్టీ 369 మంది ఉద్యమకారులను కాల్చి చంపిందని ఆరోపించారు. జై తెలంగాణ అన్నందుకు విద్యార్థులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని మండిపడ్డారు. చివరి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా 1200 మంది విద్యార్థులు ఆత్మార్పణ చేసుకున్నారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నేడు ఏడు ఎయిర్ పోర్టులు ఉన్నాయని, తెలంగాణలో కేవలం ఒకే ఒక్క విమానాశ్రయం ఉందని అన్నారు.

దీనికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యమే కారణమని ఆరోపించారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పోటీతత్వంతో అభివృద్ధి కావాల్సి ఉందని అన్నారు. విభజన జరిగి పదేళ్లు దాటినా అమరావతిని రాజధానిగా చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బీజేపీ తరఫున అమరావతి చట్టబద్ధత బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు.
Kishan Reddy
Amaravati
Telangana BJP
Andhra Pradesh
Amaravati Bill
Telangana
Congress

More Telugu News