America-Iran War: ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాకు కళ్లు చెదిరే ఖర్చు.. లెక్కలు ఇవే!

Americas staggering cost of war with Iran
షార్ట్స్‌లో చూడండి
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఈ యుద్ధం కోసం అమెరికా చేస్తున్న ఖర్చు వింటే కళ్లు చెదరాల్సిందే. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ యుద్ధం కోసం అమెరికా ప్రతి సెకనుకు 10,300 డాలర్లు (సుమారు రూ.9.8 లక్షలు) ఖర్చు చేస్తోంది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం 31వ రోజుకు చేరుకోగా, ఇప్పటివరకు అమెరికా ఏకంగా 27.68 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.2.63 లక్షల కోట్లు) ఖర్చు చేసింది. యుద్ధం ముగిసే సూచనలు కనిపించకపోవడంతో ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా రోజుకు సగటున 890 మిలియన్ డాలర్లు (సుమారు రూ.8,455 కోట్లు) వెచ్చిస్తున్నట్లు సిప్రి నివేదిక వెల్లడించింది. ఈ రోజువారీ ఖర్చులో ఆయుధాలు, వైమానిక, నౌకాదళ కార్యకలాపాలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, నిఘా, రవాణా వంటివి ఉన్నాయి.

ఖర్చులో సింహభాగం ఆయుధాలకే
నివేదిక ప్రకారం ఈ ఖర్చులో సింహభాగం, అంటే రోజుకు 320 మిలియన్ డాలర్లు (సుమారు రూ.3,040 కోట్లు), ఆయుధాలు, క్షిపణులకే వెళుతోంది. టోమహాక్ క్రూయిజ్ క్షిపణులు, జేడీఏఎం బాంబులు వంటి వాటి కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు. వైమానిక కార్యకలాపాల కోసం రోజుకు 245 మిలియన్ డాలర్లు, నౌకాదళ కార్యకలాపాల కోసం 155 మిలియన్ డాలర్లు ఖర్చవుతున్నాయి. థాడ్, పేట్రియాట్ వంటి క్షిపణి రక్షణ వ్యవస్థల కోసం రోజుకు 95 మిలియన్ డాలర్లు, నిఘా, సైబర్ ఆపరేషన్ల కోసం 45 మిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నారు.

భారాన్ని పంచుతారా?
భారీగా పెరుగుతున్న ఈ యుద్ధ భారాన్ని అరబ్ దేశాలతో పంచుకోవాలని ట్రంప్ యోచిస్తున్నట్టు వైట్‌హౌస్ సంకేతాలు ఇచ్చింది. 1990 గల్ఫ్ యుద్ధ సమయంలో అరబ్ దేశాలు అమెరికాకు ఆర్థికంగా సహకరించిన విషయాన్ని గుర్తుచేయగా, వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ స్పందిస్తూ.. "అధ్యక్షుడు ట్రంప్ కూడా దీనిపై ఆసక్తిగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఈ విషయంపై త్వరలోనే ఆయన నుంచి ప్రకటన వెలువడవచ్చు" అని తెలిపారు. 

అయితే, గల్ఫ్ యుద్ధం సమయంలో మిత్రదేశాలు కలిసికట్టుగా ఉండగా, ఈసారి అమెరికా, ఇజ్రాయెల్ ఏకపక్షంగా ఇరాన్‌పై దాడికి దిగాయి. మరోవైపు యుద్ధ నష్టపరిహారం చెల్లించిన తర్వాతే చర్చలకు వస్తామని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ప్రతీకారంగా మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది.
Go Back to Shorts
America-Iran War
Iran
United States
Israel
Donald Trump
SIPRI
Middle East
War expenses
Military expenditure
US military

More Telugu News