Niharika Konidela: అందుకే వారిని పట్టించుకోవడం మానేశా: నిహారిక
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆమె ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన చిత్రం ‘రాకాస’. మానస శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నిహారిక తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చారు.
నిర్మాతగా కెరీర్ ప్రారంభించినప్పటి నుండి తనపై ఎన్నో విమర్శలు వస్తున్నాయని నిహారిక ఆవేదన వ్యక్తం చేశారు. "నేను ఏం చేసినా తప్పు పట్టేవాళ్లు ఉంటూనే ఉంటారు. 'కమిటీ కుర్రోళ్లు' సినిమాతో 11 మంది కొత్తవాళ్లను పరిచయం చేసినప్పుడు.. ఎందుకు ఇదంతా? తెలిసిన వాళ్లతో సినిమాలు చేయొచ్చు కదా అన్నారు. ఇప్పుడు ‘రాకాస’ వంటి హై-వోల్టేజ్ వీఎఫ్ఎక్స్ సినిమా చేస్తుంటే... మళ్లీ చిన్న కథలే చేయొచ్చు కదా అని సలహాలు ఇస్తున్నారు. నేనేం చేసినా మాటలు అనేవాళ్లు అంటూనే ఉంటారు, అందుకే వారిని పట్టించుకోవడం మానేశాను" అని ఆమె తెలిపారు.
నిర్మాతగా ప్రతి సినిమా తనకు ఒక పాఠమని, నిరంతరం నేర్చుకుంటూనే ఉంటానని నిహారిక తెలిపారు. "నాకు కొణిదెల కుటుంబం ఎంత ముఖ్యమో, నా ‘పింక్ ఎలిఫెంట్’ టీమ్ కూడా అంతే ముఖ్యం. నేను చేయాలనుకున్నది చేస్తూనే ఉంటాను" అని ధీమా వ్యక్తం చేశారు.