Udaan Yatri Cafe: ఎయిర్‌పోర్టుల్లో చౌక ధరలకే ఫుడ్.. రూ.10కే టీ, రూ.20కే స్నాక్స్

Rammohan Naidu Launches Affordable Udaan Yatri Cafes at 11 Airports
షార్ట్స్‌లో చూడండి
విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. విమానాశ్రయాల్లో అధిక ధరలకు చెక్ పెడుతూ, ప్రయాణికులకు నాణ్యమైన ఆహారాన్ని అత్యంత చౌక ధరలకే అందించేందుకు ఏర్పాటు చేసిన "ఉడాన్ యాత్రి కేఫ్"ల సేవలను మరింత విస్తరించింది. తాజాగా దేశంలోని మరో 11 విమానాశ్రయాల్లో ఈ కేఫ్‌లను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కేఫ్‌లలో టీ, కాఫీ, సమోసా, వాటర్ బాటిల్ వంటివి కేవలం రూ.10 నుంచే లభించనున్నాయి.

రాజ్‌కోట్ విమానాశ్రయం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి, ఈ కేఫ్‌లతో పాటు దేశవ్యాప్తంగా 57 విమానాశ్రయాల్లో ప్రయాణికులకు ఉపయోగపడే పలు ఇతర సౌకర్యాలను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. కొత్తగా ప్రారంభించిన ఉడాన్ యాత్రి కేఫ్‌లలో లక్నో, పాట్నా, రాజ్‌కోట్, జమ్మూ, శ్రీనగర్, జైపూర్, ఇండోర్ వంటి కీలక విమానాశ్రయాలు ఉన్నాయి. వీటితో పాటు డిజి యాత్ర, ఉచిత వైఫై సేవలు, ప్రయాణికుల కోసం ఉచిత గ్రంథాలయం 'ఫ్లైబ్రరీ', పిల్లల కోసం ప్రత్యేకంగా 'కిడ్స్ జోన్' వంటి సౌకర్యాలను కూడా ప్రారంభించారు. స్థానిక స్వయం సహాయక బృందాల ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు 'అవ్సార్' (AVSAR) ఔట్‌లెట్లను కూడా తెరిచారు.

అందుబాటు ధరలు.. స్థానిక రుచులు
ఈ ఉడాన్ యాత్రి కేఫ్‌లలో ధరలు చాలా అందుబాటులో ఉంటాయి. సాధారణంగా టీ రూ.10, వాటర్ బాటిల్ రూ.10, కాఫీ రూ.20, స్నాక్ రూ.20, స్వీట్ ఆఫ్ ది డే రూ.20కి లభిస్తుంది. ఈ కేఫ్‌ల మెనూలో మరో ప్రత్యేకత ఏమిటంటే, ఆయా ప్రాంతాల స్థానిక రుచులకు ప్రాధాన్యత ఇవ్వడం. ఉదాహరణకు పుణె ఎయిర్‌పోర్టులో వడా పావ్, చెన్నైలో వడై, కోయంబత్తూరులో మెధు వడ వంటివి అందిస్తున్నారు. అయితే, దాదాపు అన్ని కేఫ్‌లలో సమోసా కామన్‌గా లభిస్తోంది.

ఇప్పటికే కోల్‌కతా, చెన్నై, పుణె, విజయవాడ, ఇటానగర్, భువనేశ్వర్, సూరత్, అహ్మదాబాద్, ముంబై, మంగళూరు, తిరువనంతపురం, కోయంబత్తూరు విమానాశ్రయాల్లో ఈ కేఫ్‌లు విజయవంతంగా నడుస్తున్నాయి. తాజాగా మరో 11 చోట్ల వీటిని ప్రారంభించడంతో ప్రయాణికులపై భారం తగ్గనుంది.
Go Back to Shorts
Udaan Yatri Cafe
Rammohan Naidu
airport food prices
Indian airports
low cost food
aviation ministry
affordable snacks
airport facilities
Digi Yatra
AVSAR outlets

More Telugu News