HRA: మెట్రోల జాబితాలోకి హైదరాబాద్, బెంగళూరు.. పెరగనున్న టేక్-హోమ్ శాలరీ

Bengaluru Hyderabad Pune Ahmedabad Salaried Class Set For Secret Pay Hike
షార్ట్స్‌లో చూడండి
వేతన జీవులకు, ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో అధిక అద్దెలు చెల్లిస్తున్న వారికి ఆదాయపు పన్ను శాఖ భారీ ఊరట కల్పించింది. ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)పై పన్ను మినహాయింపు నిబంధనలను సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం రెండు రోజుల్లో, అంటే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధన ప్రకారం హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ వంటి నగరాల్లో నివసించే వారు కూడా ఇకపై 50 శాతం హెచ్ఆర్ఏ మినహాయింపు పొందేందుకు అర్హులు. ఇప్పటివరకు ఈ సౌకర్యం ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి నాలుగు ప్రధాన మెట్రో నగరాలకే పరిమితమై ఉండేది. ఈ మార్పుతో వేలాది మంది ఉద్యోగుల టేక్-హోమ్ శాల‌రీ భారీగా పెరిగే అవకాశం ఉంది.

గత కొన్నేళ్లుగా హైదరాబాద్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగాయి. అయితే, పన్ను మినహాయింపు పరిమితి తక్కువగా ఉండటంతో ఉద్యోగులు అధిక అద్దెలు చెల్లిస్తున్నప్పటికీ పూర్తి ప్రయోజనం పొందలేకపోయారు. ఈ వ్యత్యాసాన్ని సరిదిద్దేందుకే ప్రభుత్వం ఈ కొత్త మార్పును తీసుకొచ్చింది. దీనివల్ల ఉద్యోగులు చెల్లిస్తున్న అద్దెకు, పొందుతున్న పన్ను మినహాయింపునకు మధ్య సమతుల్యం ఏర్పడుతుంది.

ప్రయోజనం ఎవరికి?.. ఎలా లెక్కిస్తారు?
ఈ ప్రయోజనం కేవలం పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని గమనించాలి. కొత్త పన్ను విధానంలో ఉన్నవారికి ఇది వర్తించదు. వాస్తవంగా అందుకున్న హెచ్ఆర్ఏ, జీతంలో 10 శాతం కంటే అదనంగా చెల్లించిన అద్దె, లేదా జీతంలో 50 శాతం (కొత్తగా చేర్చిన నగరాలకు)... ఈ మూడింటిలో ఏది తక్కువైతే దానిపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ముఖ్యంగా తమ బేసిక్ శాలరీలో దాదాపు 50 శాతం హెచ్ఆర్ఏగా పొందుతున్న మధ్య, ఉన్నత ఆదాయ వర్గాల వారికి ఈ మార్పు వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. నిపుణుల అంచనా ప్రకారం అర్హులైన ఉద్యోగులు ఏటా రూ.60,000 నుంచి రూ.1.2 లక్షల వరకు అదనంగా పన్ను ఆదా చేసుకునే వీలుంది.

కఠినతరం కానున్న నిబంధనలు
ఈ సంస్కరణతో పాటు ప్రభుత్వం నిబంధనలను కూడా కఠినతరం చేసింది. ఇకపై పన్ను చెల్లింపుదారులు తమ ఇంటి యజమాని వివరాలను కచ్చితంగా వెల్లడించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులకు అద్దె చెల్లిస్తున్నట్లు చూపించే సందర్భాల్లో అధికారులు క్లెయిమ్‌లను మరింత నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో తమ జీతం, అద్దె, ఇతర మినహాయింపులను బేరీజు వేసుకుని పాత, కొత్త పన్ను విధానాల్లో ఏది ప్రయోజనకరమో ఉద్యోగులు నిర్ణయించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Go Back to Shorts
HRA
Hyderabad
Bengaluru
Income Tax
Tax Exemption
Take-Home Salary
House Rent Allowance
Metro Cities
Tax Rules
New Tax Regime

More Telugu News