కళ్యాణదుర్గంలో విషాదం: యూరియా నీరు తాగి 20 గొర్రెలు మృతి

Obulapathi Loses 20 Sheep to Poisoning in Kalyandurgam
  • మేతకు వెళ్లినప్పుడు సమీపంలోని తోటలో ఘటన
  • కాపరికి సుమారు రూ.2.10 లక్షల నష్టం వాటిల్లిందని అంచనా
  • పరిహారం అందించాలని ప్రభుత్వానికి బాధితుడి విజ్ఞప్తి
  • సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పశువైద్య అధికారులు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ కాపరికి చెందిన 20 గొర్రెలు కలుషిత నీరు తాగి మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనతో ఆ కాపరి జీవనోపాధిని కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామానికి చెందిన ఓబుళపతి అనే కాపరి, రోజూ మాదిరిగానే నిన్న తన 65 గొర్రెలను మేత కోసం గ్రామ సమీపంలోకి తీసుకెళ్లారు. మధ్యాహ్నం సమయంలో గొర్రెలు దాహంతో సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లాయి. అక్కడ యూరియా కలిపి ఉన్న నీటిని తాగడంతో అస్వస్థతకు గురయ్యాయి.

ఆ నీరు తాగిన కాసేపటికే గొర్రెలు ఒక్కొక్కటిగా కుప్పకూలిపోయాయి. తన కళ్ల ముందే 20 గొర్రెలు చనిపోయాయని కాపరి ఓబుళపతి ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల తనకు సుమారు రూ.2.10 లక్షల నష్టం వాటిల్లిందని వాపోయారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి తనకు వెంటనే పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.

సమాచారం అందుకున్న పశుసంవర్థక శాఖ ఏడీ కిరణ్‌కుమార్‌రెడ్డి, సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతిచెందిన గొర్రెలను పరిశీలించి, మిగిలిన గొర్రెలకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు.
 
Advertisement
Obulapathi
Kalyandurgam
Anantapur
Sheep deaths
Urea poisoning
Livestock loss
Andhra Pradesh
Mudigallu
Animal husbandry

More Telugu News