మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఒక వెబ్ సిరీస్ ఇప్పుడు 'జీ 5' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. అనీ .. రఘు కుంచె .. అనూరాధ .. కమల్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కి, భీమాగాని శ్రీవర్ధన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ సిరీస్, మొత్తం 60 ఎపిసోడ్స్ గా రూపొందినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 10 ఎపిసోడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంతవరకూ కథ ఎలా నడిచిందనేది ఇప్పుడు చూద్దాం. 

అది 'వీరభద్రపురం' అనే ఒక మారుమూల గ్రామం. అడవిని ఆనుకుని ఉన్న గ్రామం అది. ఆ గ్రామానికి యోగానందం( రఘు కుంచె) పెద్దగా ఉంటాడు. అతని తల్లి నాంచారమ్మ (అనూరాధ) పరమ గయ్యాళి. వడ్డీ వ్యాపారం చేస్తూ ఆస్తులు కూడబెడుతుంది. యోగానందం కొడుకు కార్తికేయ .. కూతుళ్లు కల్పన .. మరొకరు కావ్య. పట్నంలో మెడిసిన్ పూర్తి చేసిన కల్పన, అక్కడి నుంచి వస్తూ తన స్నేహితురాలైన 'వెన్నెల' (అనీ)ని వెంటబెట్టుకుని వస్తుంది. 

ఆ గ్రామస్తులంతా వీరభద్రస్వామిని ఇలవేల్పుగా కొలుస్తుంటారు. ఊరు మధ్యలో మర్రిచెట్టు సన్నిధినే వీరభద్రస్వామి ఆలయంగా వాళ్లంతా భావిస్తూ ఉంటారు. అక్కడే పాతకాలం నాటి ఒక 'ధర్మగంట' వ్రేళ్లడుతూ ఉంటుంది. ఆ ధర్మగంట మ్రోగింది అంటే, అన్యాయానికో .. అక్రమానికో  పాల్పడుతున్న వారిని వీరభద్రస్వామి అంతం చేశాడని అర్థం. పొద్దుపోయిన తరువాత ఎవరూ కూడా ఇళ్లనుంచి బయటికి రారు. వీరభద్రస్వామి అంతం చేసినవారికి అంతక్రియలు చేయరు. యోగానందం ఆ శవాన్ని తీసుకుని వెళ్లి 'గద్దల గుట్ట'పై వదిలేసి వస్తుంటాడు. అది ఆ కుటుంబానికి గల శాపం.

ఇక తరచూ ఆ గ్రామంపై బందిపోట్లు దాడి చేస్తుంటారు. గ్రామస్తులు దాచుకున్న సొమ్మును దోచేసుకుని వెళుతుంటారు.  కల్పనతో పాటు ఆ విలేజ్ లో అడుగుపెట్టిన వెన్నెల అక్కడ జరుగుతున్న తతంగాన్ని గురించి వింటుంది. నిజానికి ఆమె తన తండ్రి రామస్వామి ఆ విలేజ్ లో ఉన్నాడని తెలుసుకుని, అతనిని తీసుకుని వెళ్లడానికి వస్తుంది. ఒక వైపున తండ్రి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే, మిగతా విషయాలపై ఓ కన్నేస్తుంది. 

జరుగుతున్న సంఘటనలకు వీరభద్రస్వామి కారకుడైతే, అతనిపైనే యాక్షన్ తీసుకోవాలని పోలీస్ ఆఫీసర్ రవికి ఫిర్యాదు చేస్తుంది. వీరభద్రస్వామికి ఎదురెళ్లవద్దని స్థానికులు చెప్పినా వెన్నెల వినిపించుకోదు. ఆమె తీసుకున్న ఆ నిర్ణయం వలన ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? కొంతమంది కథను ముగించడం కోసం నిజంగానే వీరభద్రస్వామి రంగంలోకి దిగుతున్నాడా? బందీపోటు దొంగలకు నాయకుడు ఎవరు? వెన్నెల తన తండ్రి జాడ తెలుసుకోగలుగుతుందా? అనేది మిగతా కథ.

ఈ కథ 1972 - 1992 మధ్య కాలంలో జరుగుతుంది. వీరభద్రపురంలో అందరికీ ఇలవేల్పుగా ఉన్న వీరభద్రుడి వైపు నుంచి ..ఆ గ్రామాన్ని దోచుకుంటున్న బందిపోట్ల వైపు నుంచి .. ఆ విలేజ్ లో వడ్డీ వ్యాపారం చేసే నాంచారమ్మ వైపు నుంచి .. తన తండ్రి జాడ తెలుకోవడానికి ఆ గ్రామంలోకి అడుగుపెట్టిన వెన్నెల వైపు నుంచి ఈ కథ నడుస్తూ ఉంటుంది. ఈ నాలుగు కోణాల వైపు నుంచి ఆసక్తిని రేకెత్తించడానికి దర్శకుడు తనవంతు ప్రయత్నం చేశాడు.

జరుగుతున్న హత్యలకు నిజంగానే వీరభద్రుడు కారకుడా? దోచేసిన సొమ్మును బందిపోట్లు ఎక్కడ దాస్తున్నారు? నాంచారమ్మ దురాశ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? వెన్నెల తండ్రి ఎవరు? అతణ్ణి కలుసుకోవడానికి ఆమె ఎందుకు ఆరాట పడుతోంది?  అనే అంశాలు కుతూహలాన్ని పెంచుతూ ముందుకు సాగుతుంటాయి. ఈ నాలుగు ట్రాకులతో సంబంధం కలిగిన మిగతా పాత్రలు తెరపైకి వచ్చి వెళుతుంటాయి. వాటిలో కొన్ని ప్రాధాన్యతను కలిగినవి కూడా కనిపిస్తాయి. 

'వీరభద్రుని రహస్యం' అనే ఈ సిరీస్ ను చూస్తుంటే, గతంలో జెమినీ టీవీలో వచ్చిన 'మర్మదేశం' సీరియల్ గుర్తుకు వస్తుంది. వీరభద్రస్వామి ఆలయ నేపథ్యం .. అడవిని ఆనుకుని ఉన్న విలేజ్ .. తెల్లగుర్రం .. అందరూ చెప్పుకునే ఓ గుట్ట వంటి నేపథ్యాలతో,  గతం - వర్తమానానికి సంబంధించిన కథను పక్కపక్కనే చూపిస్తూ వెళ్లడం వంటి పోలికలతో ఈ సిరీస్ నడవడం కనిపిస్తుంది. అయితే ఆ సీరియల్ స్థాయిలో ఈ కథను నడిపించగలిగారా అంటే .. లేదనే చెప్పవలసి ఉంటుంది. 

నిజానికి టైటిల్స్ దగ్గర నుంచే ఈ సిరీస్ కుతూహలాన్ని పెంచుతుంది. అయితే కథ మొదలైన తరువాత, వీరభద్రుడి పట్ల స్థానికుల విశ్వాసం .. జరుగుతున్న సంఘటనల పట్ల భయం .. పోలీసుల ఇన్వెస్టిగేషన్ .. బందిపోట్ల దాడి .. మొదలైన సంఘటనలను ఉత్కంఠభరితంగా ఆవిష్కరించలేకపోయారు. సస్పెన్స్ కి సంబంధించిన అంశాలపై కసరత్తు తగ్గడం .. అది ఎమోషన్ తో లింకై లేకపోవడం లోపంగా అనిపిస్తుంది.

'వరి' కోసే కొడవళ్లతో  బందిపోట్లు దాడి చేయడం, వాళ్లలో కొందరు దోచుకుంటే, మరికొందరు ఆ సొమ్మును దాస్తారని చెప్పుకోవడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్ తమ చేతికి అందేంత దూరంలో ఉంటే, అతనిపై గ్రామస్తులు రాళ్లు విసరడం .. నేరస్తుడు పారిపోతుంటే  పోలీస్ ఆఫీసర్ అతని వెంటపడి క్రాస్ చేసి ముందుకొచ్చి షూట్ చేయాలనుకోవడం .. శవాన్ని నాలుగు చక్రాల తోపుడు బండిపై పెట్టుకుని తాళ్లు కట్టుకుని లాగడం వంటి సీన్స్ కూడా అలాంటివే.

ఈ సిరీస్ లో అనూరాధ పాత్ర నుంచి ఆడియన్స్ ఎక్కువ అవుట్ పుట్ ను ఆశిస్తారు. కానీ ఈ 10 ఎపిసోడ్స్ లో మాత్రం ఆమె వైపు నుంచి అంతగొప్ప సీన్స్ పడలేదనే చెప్పాలి. 'అనీ' మంచి ఆర్టిస్ట్. ఆమెనే ఈ సిరీస్ లో మెయిన్ రోల్. అయితే ఈ పాత్రకి ఆమె ఏజ్ సరిపోలేదేమో అనిపిస్తుంది. చిన్నపిల్ల మాదిరిగానే కనిపిస్తుంది.   

ఈ సిరీస్ కథాకథనాలు ఓ మాదిరిగా అనిపిస్తాయి. 'మర్మదేశం' ఛాయలు ఉన్నప్పటికి, ఆ స్థాయి ట్రీట్మెంట్ ను ఆశించలేము. అయితే కెమెరా పనితనం .. లైటింగ్ .. నేపథ్య సంగీతం బలమైన సపోర్టును అందించాయని చెప్పాలి. లొకేషన్స్ కూడా కథకి మరింత తొందరగా కనెక్ట్ అయ్యేలా చేశాయి. అయితే సంభాషణలు బలహీనంగా అనిపిస్తాయి. మొదటి నుంచి ఈ లోటు తెలుస్తూ ఉంటుంది. అక్కడక్కడా అనవసరమైన సంభాషణలు .. 'కాఫీ మాడిపోతుంది' వంటి మాటలు వినిపిస్తాయి.      

నిజానికి ఇది విస్తారమైన కథనే. పాత్రల సంఖ్య కూడా కథకి తగినట్టుగానే ఉంటుంది. అయితే ఆ పాత్రలను డిజైన్ చేయడం .. వాటి స్వభావాన్ని ఆసక్తికరంగా ఆవిష్కరించడం .. నెక్స్ట్ ఏం జరుగనుందా? అనే ఒక క్యూరియాసిటీని కలిగించలేకపోయారు. ఇంకా చాలానే ఎపిసోడ్స్ ఉన్నాయని అంటున్నారు గనుక, ఆ ఎపిసోడ్స్ ను మరింత పట్టుగా మార్చుకుంటారేమో చూడాలి. ఈ 10 ఎపిసోడ్స్ వరకు మాత్రమే చూసుకుంటే,ఓ మాదిరిగా అనిపిస్తుందంతే.