Donald Trump: సౌదీ యువరాజు నన్ను ప్రసన్నం చేసుకుంటున్నారు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Donald Trump says Saudi Prince is Kissing My Ass
షార్ట్స్‌లో చూడండి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ (MBS) తనను ప్రసన్నం చేసుకుంటున్నారని (kissing my ass) వ్యాఖ్యానించారు. ఫ్లోరిడాలో జరిగిన ఓ పెట్టుబడిదారుల సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తన అధ్యక్షతన అమెరికా ఇంత బలంగా ఎదుగుతుందని సౌదీ యువరాజు ఊహించలేదని ట్రంప్ అన్నారు. "ఏడాది క్రితం మీది చచ్చిన దేశం, ఇప్పుడు ప్రపంచంలోనే హాటెస్ట్ కంట్రీ అని ఆయన (సల్మాన్) నాతో అన్నారు" అని ట్రంప్ పేర్కొన్నారు. "నేను మరో ఓడిపోయిన అమెరికా అధ్యక్షుడిలా ఉంటానని ఆయన అనుకున్నారు. కానీ ఇప్పుడు నాకు మర్యాద ఇవ్వాల్సి వస్తోంది" అంటూ ఎద్దేవా చేశారు.

అయితే, వెంటనే స్వరం మార్చిన ట్రంప్.. సౌదీ యువరాజును "అద్భుతమైన వ్యక్తి", "యోధుడు" అని కొనియాడారు. ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు సౌదీ అరేబియాతో పాటు ఇతర గల్ఫ్ దేశాలు మద్దతుగా నిలిచాయని ప్రశంసించారు. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ మనతో కలిసి పోరాడాయని గుర్తుచేశారు.

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమై నెల రోజులు పూర్తయిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్‌తో భవిష్యత్తులో కుదుర్చుకునే ఏ ఒప్పందమైనా ఆ దేశ క్షిపణి, డ్రోన్ సామర్థ్యాలను శాశ్వతంగా నిరోధించాలని గల్ఫ్ దేశాలు అమెరికాపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇంధన సరఫరాలను ఇరాన్ మళ్లీ ఆయుధంగా వాడకుండా చూడాలని కోరుతున్నాయి.

కాగా, ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం డజనుకు పైగా దేశాల్లో ప్రభావం చూపుతోంది. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు ఇరాన్‌లో 1,900 మందితో సహా మొత్తం 4,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని 'ది ఇండిపెండెంట్' నివేదించింది.
Go Back to Shorts
Donald Trump
Saudi Arabia
Mohammed bin Salman
Iran
US relations
Middle East conflict
Saudi Crown Prince
Gulf countries
Iran nuclear deal
US foreign policy

More Telugu News