Balendra Shah: నేపాల్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం.. నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన 35 ఏళ్ల బాలేంద్ర షా

Balendra Shah appointed Nepals new Prime Minister
షార్ట్స్‌లో చూడండి
నేపాల్ రాజకీయాల్లో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ నూతన ప్రధానమంత్రిగా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) పార్లమెంటరీ నేత బాలేంద్ర షా (బాలేన్ షా) నియమితులయ్యారు. ఈరోజు అధ్యక్ష భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 76(1) ప్రకారం బాలేన్ షాను ప్రధానిగా నియమించారు. కేవలం 35 ఏళ్ల వయసులో ప్రధాని బాధ్యతలు చేపట్టిన బాలేన్, దేశ 47వ ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు.

హిందూ, బౌద్ధ సంప్రదాయాల నడుమ ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. శుభారంభానికి సూచికగా ఏడుగురు కళాకారులు ‘శంఖనాదం’ వినిపించగా, 108 మంది వేద పండితులు ‘స్వస్తి శాంతి’ మంత్రాలు పఠించారు. అదే సమయంలో 16 మంది బౌద్ధ భిక్షువులు ‘అష్టమంగళ’ మంత్రోచ్చారణ చేశారు.

ఈ నెల‌ 5న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బాలేన్ షా నేతృత్వంలోని ఆర్ఎస్పీ పార్టీ సంచలన విజయం సాధించింది. మొత్తం 275 స్థానాలకు గాను 182 సీట్లు గెలుచుకుని, మూడింట రెండొంతుల మెజారిటీకి చేరువైంది. ఎన్నికల ప్రచారంలోనే బాలేన్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన ఆ పార్టీ, గురువారం జరిగిన సమావేశంలో ఆయన్ను పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ పరిణామంతో ఆయన ప్రధాని అయ్యేందుకు మార్గం సుగమమైంది.

ఝాపా-5 నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బాలేన్ షా, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీపై 49,614 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. బాలేన్‌కు 68,348 ఓట్లు రాగా, ఓలీకి కేవలం 18,734 ఓట్లు మాత్రమే వచ్చాయి. 1991 తర్వాత నేపాల్ పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో ఒక అభ్యర్థికి ఇన్ని ఓట్లు రావడం ఇదే తొలిసారి.

1990లో ఖాట్మండులో ఒక మధేశీ కుటుంబంలో జన్మించిన బాలేన్ షా, భారత్‌లోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీ నుంచి స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2022లో స్వతంత్ర అభ్యర్థిగా ఖాట్మండు మేయర్‌గా గెలిచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన యువతలో విపరీతమైన జనాదరణ సంపాదించుకున్నారు. ఆయన నియామకం నేపాల్ రాజకీయాల్లో తరం మార్పునకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
Go Back to Shorts
Balendra Shah
Nepal Prime Minister
Nepal Politics
Rastriya Swatantra Party
Ram Chandra Paudel
KP Sharma Oli
Nepal Election 2024
Kathmandu Mayor
New Prime Minister Nepal

More Telugu News