Donald Trump: ఇరాన్‌పై దాడులను మరో 10 రోజులు నిలిపివేసిన అమెరికా

Donald Trump Extends Suspension of Iran Attacks for 10 Days
షార్ట్స్‌లో చూడండి
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలకు తాత్కాలికంగా తెరపడింది. ఇరాన్‌పై సైనిక దాడుల నిలిపివేతను మరో 10 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ చేసిన అభ్యర్థన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఏప్రిల్ 6 వరకు ఆ దేశ ఇంధన, విద్యుత్ మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడులు ఉండవని ఆయన స్పష్టం చేశారు.

యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్‌తో జరుపుతున్న చర్చలు అద్భుతంగా ముందుకు సాగుతున్నాయని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో పేర్కొన్నారు. చర్చల్లో మంచి పురోగతి కనిపిస్తోందని, దీనిపై వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు. ఈ సానుకూల వాతావరణం నేపథ్యంలోనే దాడుల నిలిపివేతను పొడిగించినట్లు వివరించారు.

గతంలో హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలంటూ ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేశారు. ఇప్పుడు ఆ గడువును మరో పది రోజులకు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు, ఇరాన్‌తో ఉద్రిక్తతల కారణంగా తన చైనా పర్యటనను మే 14, 15 తేదీలకు వాయిదా వేసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ తన పొరుగు దేశాలైన సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. తాజా పరిణామాలతో ఈ 10 రోజుల విరామం శాశ్వత కాల్పుల విరమణకు దారితీస్తుందో లేదోనని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
Go Back to Shorts
Donald Trump
Iran
US Iran tensions
Iran attacks
West Asia conflict
Hormuz Strait
Saudi Arabia
Qatar
UAE
China

More Telugu News