Reliance Industries: ఇరాన్ చమురు కొనుగోలు వార్తలపై క్లారిటీ ఇచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్

Reliance Industries Denies Purchasing Iranian Oil
షార్ట్స్‌లో చూడండి
ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోలు చేసినట్లు తమపై వస్తున్న వార్తలను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) తీవ్రంగా ఖండించింది. ఈ కథనాలు పూర్తిగా నిరాధారమైనవి అని కొట్టిపారేసింది. ఈ మేరకు గురువారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

సముద్ర మార్గంలో చిక్కుకుపోయిన ఇరాన్ ముడి చమురుపై అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా ఆంక్షలను సడలించడంతో, రిలయన్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకుందని పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ నుంచి రిలయన్స్ సుమారు 5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేసిందని ఈ కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ స్పందించింది.

"ఇరాన్‌కు చెందిన ముడి చమురును కంపెనీ కొనుగోలు చేసిందంటూ ఇటీవలి మీడియా నివేదికలను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తోంది. ఈ నివేదికలు నిరాధారమైనవి. ప్రజలను తప్పుదారి పట్టించేలా, తప్పుడు వాదనలకు దారితీసేలా ఉన్నాయి" అని కంపెనీ తన ప్రకటనలో స్పష్టం చేసింది. వార్తలను ప్రచురించే ముందు సంబంధిత మీడియా సంస్థలు వాస్తవాలను ధృవీకరించుకోవాలని హితవు పలికింది.

గత వారం, అమెరికా ఆర్థిక శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నౌకల్లో నింపి, సముద్రంలో చిక్కుకుపోయిన ఇరాన్ చమురు అమ్మకానికి స్వల్పకాలిక అధికారాన్ని మంజూరు చేసింది. ఈ చర్య ద్వారా ప్రపంచ సరఫరాను వేగంగా పెంచవచ్చని, అదే సమయంలో టెహ్రాన్‌పై ఒత్తిడిని కొనసాగించవచ్చని డొనాల్డ్ ట్రంప్ పరిపాలన యంత్రాంగం భావిస్తున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.

అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ మాట్లాడుతూ, "ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇంధన మార్కెట్లను స్థిరీకరించడానికి ఈ చర్య తీసుకున్నాం. మార్చి 20 నాటికి ఇప్పటికే నౌకల్లో లోడ్ చేసిన చమురుకు మాత్రమే ఈ అధికారం వర్తిస్తుంది" అని తెలిపారు. ఏప్రిల్ 19 వరకు ఈ వెసులుబాటు అమల్లో ఉంటుందని ట్రెజరీ జనరల్ లైసెన్స్‌లో పేర్కొన్నారు. 

ఈ నిర్ణయంతో సుమారు 140 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురు ప్రపంచ మార్కెట్లలోకి అందుబాటులోకి వస్తుందని, సరఫరాపై ఒత్తిడి తగ్గుతుందని బెస్సెంట్ వివరించారు. ఆంక్షలు విధించిన ఇరాన్ చమురులో ఎక్కువ భాగం చైనా వంటి దేశాలు చౌకగా నిల్వ చేసుకుంటున్నాయని, ఈ తాజా నిర్ణయంతో టెహ్రాన్ ప్రాబల్యాన్ని తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాల మధ్య తమపై వచ్చిన ఆరోపణలను రిలయన్స్ ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.


Go Back to Shorts
Reliance Industries
Iran oil
Reliance Iran oil purchase
oil imports
crude oil
oil sanctions
US sanctions
National Iranian Oil Company
Scott Bessent
Donald Trump

More Telugu News