Iran: అమెరికాతో చర్చలు లేవు.. కేవలం సందేశాలు మాత్రమే: ఇరాన్

Seyed Abbas Araghchi says No Talks with US Only Messages Exchanged
షార్ట్స్‌లో చూడండి
అమెరికాతో తమకు ఎలాంటి చర్చలు జరగడం లేదని, అయితే గత కొన్ని రోజులుగా మధ్యవర్తుల ద్వారా ఇరు దేశాల మధ్య సందేశాలు మాత్రం మార్పిడి అవుతున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ వెల్లడించారు. ఇవి చర్చలు లేదా సంప్రదింపుల కిందకు రావని ఆయన స్పష్టం చేశారు. బుధవారం స్థానిక మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

"గత కొన్ని రోజుల నుంచి అమెరికా వైపు నుంచి వివిధ మధ్యవర్తుల ద్వారా మాకు సందేశాలు వస్తున్నాయి. స్నేహపూర్వక దేశాల ద్వారా వచ్చే ఆ సందేశాలకు మేము మా వైఖరిని స్పష్టం చేస్తూ, అవసరమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాం. దీనిని చర్చలు అనరు. కేవలం సందేశాల మార్పిడి మాత్రమే జరిగింది" అని అరాఘ్చీ వివరించారు. తమ దేశంలోని మౌలిక సదుపాయాలపై దాడి చేయవద్దని తాము పంపిన ఒక సందేశంలో అమెరికాను తీవ్రంగా హెచ్చరించామని, దాని ఫలితంగా 48 గంటల్లో ఇరాన్ విద్యుత్ ప్లాంట్లపై దాడి చేస్తామన్న తన హెచ్చరికను వాషింగ్టన్ వెనక్కి తీసుకుందని ఆయన పేర్కొన్నారు.

తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, ఈ ఘర్షణను ప్రారంభించింది కూడా తాము కాదని అరాఘ్చీ పునరుద్ఘాటించారు. అయితే, కేవలం కాల్పుల విరమణకు తాము అంగీకరించబోమని తేల్చిచెప్పారు. అది మళ్లీ చర్చలు, యుద్ధం, తాత్కాలిక సంధి అనే చక్రంలోకి నెడుతుందని అభిప్రాయపడ్డారు. తమ షరతుల ప్రకారమే ఈ యుద్ధానికి శాశ్వత ముగింపు పలకాలని కోరుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దేశాన్ని రక్షించుకోవడమే తమ ప్రస్తుత విధానమని, చర్చలకు ఎలాంటి ప్రణాళిక లేదని తెలిపారు.

హ‌ర్మూజ్ జలసంధి ఇరాన్, ఒమన్ ప్రాదేశిక జలాల్లో భాగమని, ఈ జలసంధి ద్వారా సురక్షిత ప్రయాణానికి సంబంధించి "కొత్త ఏర్పాట్ల"పై అధ్యయనం చేస్తున్నామని అరాఘ్చీ వెల్లడించారు.

ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా టెహ్రాన్‌తో పాటు పలు ఇరాన్ నగరాలపై దాడులు జరిపి, అప్పటి సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు పలువురు సీనియర్ సైనిక కమాండర్లు, పౌరులను హతమార్చిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా ఇరాన్.. ఇజ్రాయెల్, మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తూ, హార్ముజ్ జలసంధిపై పట్టు బిగించింది. ఈ నేపథ్యంలో, ఇరాన్ తమతో చర్చలు జరుపుతోందని, యుద్ధాన్ని ముగించేందుకు ఒక ఒప్పందం కోరుకుంటోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను అరాఘ్చీ తాజా ప్రకటన ద్వారా ఖండించినట్లయింది.
Go Back to Shorts
Iran
Seyed Abbas Araghchi
United States
Iran US relations
Hormuz Strait
Nuclear Deal
Middle East tensions
Israel
Military conflict
Diplomacy

More Telugu News