BHIM App: భీమ్ యాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్లు

BHIM App Introduces Pinless UPI Payments with Biometric Authentication
షార్ట్స్‌లో చూడండి
యూపీఐ చెల్లింపులను మరింత సులభతరం, వేగవంతం చేసే దిశగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) కీలక ముందడుగు వేసింది. ఎన్‌పీసీఐకు చెందిన ఎన్‌పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎన్‌బీఎస్ఎల్), మంగళవారం భీమ్ పేమెంట్స్ యాప్‌లో సరికొత్త బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త అప్‌డేట్ ద్వారా వినియోగదారులు రూ. 5,000 వరకు జరిపే లావాదేవీలకు తమ స్మార్ట్‌ఫోన్‌లోని వేలిముద్ర (ఫింగర్‌ప్రింట్) లేదా ఫేషియల్ రికగ్నిషన్ ఉపయోగించి సులభంగా ఆమోదం తెలపవచ్చు.

ఈ ఫీచర్‌తో ప్రతి చిన్న లావాదేవీకి యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. చాలా సందర్భాల్లో పిన్ మర్చిపోవడం లేదా తప్పుగా నమోదు చేయడం వల్ల చెల్లింపులు విఫలమవుతుంటాయి. ఈ కొత్త విధానం ద్వారా అలాంటి ఇబ్బందులకు తెరపడుతుందని, చెల్లింపుల ప్రక్రియ మరింత సౌకర్యవంతంగా మారుతుందని ఎన్‌బీఎస్ఎల్ విశ్వాసం వ్యక్తం చేసింది. స్నేహితులు, కుటుంబ సభ్యులకు డబ్బు పంపడం, షాపుల్లో క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయడం, ఆన్‌లైన్ చెల్లింపులు వంటి రోజువారీ లావాదేవీలన్నింటికీ ఈ బయోమెట్రిక్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు.

ఈ సందర్భంగా ఎన్‌బీఎస్ఎల్ ఎండీ, సీఈవో లలితా నటరాజ్ మాట్లాడుతూ.. డిజిటల్ చెల్లింపులను అందరికీ సులభంగా, సురక్షితంగా అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. "వినియోగదారులు తమ వేలిముద్ర లేదా ఫేస్ అన్‌లాక్ ద్వారా లావాదేవీలను నిర్ధారించడం వల్ల పిన్‌పై ఆధారపడటం తగ్గుతుంది. అదే సమయంలో చెల్లింపులు యూజర్ బయోమెట్రిక్‌తో ముడిపడి ఉండటం వల్ల బలమైన భద్రత కూడా కొనసాగుతుంది" అని ఆమె వివరించారు. బయోమెట్రిక్ డేటా వినియోగదారుడి ఫోన్‌లోనే సురక్షితంగా నిల్వ ఉండటం వల్ల పిన్ షేరింగ్ వంటి ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు.

అయితే, భద్రత దృష్ట్యా రూ. 5,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు మాత్రం వినియోగదారులు తప్పనిసరిగా యూపీఐ పిన్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది పెద్ద మొత్తంలో జరిగే చెల్లింపులకు అదనపు రక్షణ కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్.. ఫింగర్‌ప్రింట్ లేదా ఫేషియల్ రికగ్నిషన్ సపోర్ట్ చేసే ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులోకి వచ్చింది.
Go Back to Shorts
BHIM App
UPI payments
NPCI
biometric authentication
fingerprint recognition
facial recognition
digital payments
Lalita Nataraj
NBBL
UPI PIN

More Telugu News