Chandrababu Naidu: 20 నెలల్లోనే ఆర్సెలర్ మిట్టల్ ను తీసుకొచ్చాం... ఇదీ మా స్పీడు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Brings Arcelor Mittal to Andhra Pradesh in 20 Months
షార్ట్స్‌లో చూడండి
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో చారిత్రక అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ప్రపంచ ప్రఖ్యాత ఆర్సెలర్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ఇండియా (AM/NS India) ఏర్పాటు చేయనున్న భారీ ఉక్కు కర్మాగారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ప్రకటించారు. కేవలం 20 నెలల వ్యవధిలోనే 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానంలో ఈ భారీ ప్రాజెక్టును సాకారం చేసి చూపించామని చంద్రబాబు అన్నారు. ఇది కేవలం స్టీల్ ప్లాంట్ కాదని, భవిష్యత్తులో ఓ స్టీల్ సిటీకి పునాది అని ఆయన అభివర్ణించారు.

స్టీల్ ప్లాంట్ కాదు.. స్టీల్ సిటీ
రెండు దశల్లో నిర్మితమయ్యే ఈ ఉక్కు పరిశ్రమ ద్వారా ఏటా 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రూ.11,198 కోట్ల వ్యయంతో క్యాప్టివ్ పోర్టు కూడా నిర్మిస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమకు అవసరమైన ముడి ఇనుము సరఫరా కోసం ప్రత్యేక పైప్‌లైన్, జాతీయ రహదారిని అనుసంధానిస్తూ నాలుగు లైన్ల రహదారి నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు. 

2028 నాటికి ప్లాంట్‌లో మొదటి దశ ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, 2030 జూన్ నాటికి మొదటి బ్లాస్ట్ ఫర్నెస్, అదే ఏడాది డిసెంబరు నాటికి రెండో బ్లాస్ట్ ఫర్నెస్ నిర్మాణం పూర్తి చేస్తారని కార్యాచరణను వివరించారు. ఈ ప్రాజెక్టుతో ఉక్కు ఉత్పత్తి మాత్రమే కాకుండా విద్య, వైద్యం, ఉద్యోగాలతో ఈ ప్రాంత రూపురేఖలే మారిపోతాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

20 నెలల్లోనే సాధించాం
దేశంలోనే అత్యంత వేగంగా భూసేకరణ, అనుమతులు ఇచ్చి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించిన ఘనత ఆంధ్రప్రదేశ్‌కే దక్కుతుందని చంద్రబాబు అన్నారు. పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఏపీ సొంతమని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 20 నెలల్లోనే రాష్ట్రానికి రూ.20.35 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగామని తెలిపారు. ఈ ప్రాజెక్టు సాకారంలో కీలక పాత్ర పోషించిన ఆదిత్య మిట్టల్, మంత్రి నారా లోకేష్‌ను ఆయన అభినందించారు. పరిశ్రమ ఏర్పాటుకు భూములను త్యాగం చేసిన రైతులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

విశాఖ కేంద్రంగా ఆర్థిక ప్రగతి
ఈ ప్రాజెక్టుతో విశాఖ ఎకనామిక్ రీజియన్.. నాలెడ్జ్ ఎకానమీ, పోర్టులు, స్టీల్, డేటా సెంటర్లు, ఐటీకి కీలక కేంద్రంగా మారుతుందని సీఎం పేర్కొన్నారు. ఇప్పటికే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రాబోతోందని, దీని ద్వారా 15 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రావడం దేశంలో ఇదే తొలిసారని గుర్తుచేశారు. టీసీఎస్, కాగ్నిజెంట్, రిలయన్స్, బీపీసీఎల్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. 

ఉత్తరాంధ్ర రేర్ ఎర్త్ మినరల్ హబ్‌గా మారుతుందని, పరిశ్రమలకు అవసరమైన నీటిని పోలవరం ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. కొత్తగా మూలపేట పోర్టు, జూలైలో ప్రారంభం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటివి ఉత్తరాంధ్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాయని అన్నారు.

స్థానిక యువతకే తొలి ప్రాధాన్యం
ఆర్సెలర్ మిట్టల్ పరిశ్రమను ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి, నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేందుకు పూర్తి సహకారం అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. భూములు త్యాగం చేసిన రైతులకు అండగా నిలవాలని కంపెనీ యాజమాన్యాన్ని కోరారు. 

ముఖ్యంగా, ఈ పరిశ్రమలో తొలి ప్రాధాన్యంగా అనకాపల్లి జిల్లా యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఆయన సూచించారు. స్థానిక యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్నందుకు కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. 'వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్' నినాదాన్ని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా విజయవంతం చేస్తామని పునరుద్ఘాటించారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Arcelor Mittal
AMNS India
Andhra Pradesh
Steel Plant
Anakapalle
Nara Lokesh
Visakhapatnam
Industrial Development
AP Investments

More Telugu News