Nara Lokesh: నారా లోకేశ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు: కేంద్రమంత్రి కుమారస్వామి

Nara Lokesh Proves Worthy Son Says Minister Kumaraswamy
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టానికి తెరలేచింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వద్ద ప్రపంచ ప్రఖ్యాత ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ (ఏఎంఎన్ఎస్) ఏర్పాటు చేయనున్న భారీ సమీకృత ఉక్కు కర్మాగారానికి సోమవారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సుమారు రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో, దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుగా ఇది రూపుదిద్దుకోనుంది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఆర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్, ఏఎంఎన్ఎస్ ఇండియా ఛైర్మన్ ఆదిత్య మిట్టల్, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

చంద్రబాబు పాలన అద్వితీయం 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. "ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపు, అపారమైన పరిపాలనా అనుభవం, పారిశ్రామిక అభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధత వల్లే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత ప్రగతిశీల, పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా నిలిచింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి వారి నాయకత్వం అద్వితీయంగా రాణిస్తోంది. తండ్రికి తగ్గ తనయుడిగా నారా లోకేశ్ కూడా నిరూపించుకుంటున్నారు.ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడంలో లోకేశ్ కీలక పాత్ర పోషించారు" అని అన్నారు. ఈ భారీ ప్రాజెక్టు కోసం అనకాపల్లిని ఎంచుకోవడం రాష్ట్ర ప్రభుత్వ వ్యూహాత్మక దార్శనికతకు నిదర్శనమని కొనియాడారు.


దేశ ప్రగతిలో భాగస్వామ్యం 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారత్ పారిశ్రామిక పునరుజ్జీవనంలో కొత్త శకంలోకి ప్రవేశించిందని కుమారస్వామి పేర్కొన్నారు. "ప్రధాని మోదీ రూపకల్పన చేసిన 'వికసిత్ భారత్ 2047', 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యాల్లో భాగంగా దేశీయ ఉత్పాదన గణనీయంగా పెరగాలి. జాతీయ ఉక్కు వినియోగ విధానాన్ని అనుసరించి దేశవ్యాప్తంగా ఉక్కు ఉత్పాదనను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ పరిశ్రమ ఏపీకి రావడంతో ఈ ప్రాంతంలో స్టీల్ ఎకోసిస్టమ్‌ సాకారమైంది" అని వివరించారు. ఈ ప్రాజెక్టు ఉక్కు ఉత్పాదనకు, ఎంఎస్ఎంఈలకు, ఉద్యోగ కల్పనకు ఒక చోదక శక్తిగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

విశాఖ ఉక్కుపై స్పష్టమైన హామీ 
ఇదే వేదికపై నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (RINL) పునరుద్ధరణపై కేంద్ర మంత్రి కుమారస్వామి స్పష్టమైన హామీ ఇచ్చారు. "వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను స్థిరీకరించి, గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.11,440 కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఆర్‌ఐఎన్ఎల్‌ను బలోపేతం చేయడానికి, ఉక్కు రంగంలో దాని పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కేంద్రం కట్టుబడి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి కృషితో ఆ సంస్థను తిరిగి వృద్ధి పథంలో నిలుపుతాం" అని ఆయన స్పష్టం చేశారు.

లక్ష మందికి ఉపాధి.. ప్రాంతీయ అభివృద్ధి 
ఈ ప్రాజెక్టును 5,400 ఎకరాల విస్తీర్ణంలో రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 17.8 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పాదక సామర్థ్యంతో పనిచేస్తుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా రూ.11,000 కోట్లకు పైగా పెట్టుబడితో 50 మిలియన్ టన్నుల సామర్థ్యంతో క్యాప్టివ్ పోర్టును కూడా నిర్మించనున్నారు. ఇది మరో 6,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఈ ప్లాంట్ స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా, అనుబంధ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలను బలోపేతం చేసి ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని కుమారస్వామి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి ఉత్పాదన ప్రారంభించాలని ఆకాంక్షిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
Go Back to Shorts
Nara Lokesh
Andhra Pradesh
Arcelor Mittal Nippon Steel
AMNS
Visakhapatnam Steel Plant
RINL
Chandrababu Naidu
HD Kumaraswamy
Steel Plant
Industrial Development

More Telugu News