Vaibhav Suryavanshi: ఏబీడీ మెచ్చిన ఆటగాడు.. కానీ రాత్రిపూట అది తినడం మానడట!

Vaibhav Suryavanshi Praised by ABD but Addicted to Ice Cream
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్‌ 2026 సీజన్ ప్రారంభానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నెలకొంది. కేవలం 14 ఏళ్ల వయసులోనే గత సీజన్‌లో ఐపీఎల్ సెంచరీ బాది రికార్డు సృష్టించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్, ఆ తర్వాత భారత అండర్-19 జట్టు తరఫున కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో అతనిపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ క్రమంలో అతని ఆటతీరు, ప్రొఫెషనలిజంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దక్షిణాఫ్రికా దిగ్గజం, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్.. వైభవ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతుండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఆటగాడు జితేశ్ శర్మ మాత్రం సరదాగా చురకలు అంటించాడు. ఏబీ డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానల్‌లో జితేశ్‌తో మాట్లాడుతూ వైభవ్ గురించి ప్రస్తావించాడు.

"వైభవ్ గొప్ప ఆటగాడు. అండర్-19లో అతని ఆటను చూశాను. ఐపీఎల్ లాంటి పెద్ద లీగ్‌లలో ఆడిన తర్వాత అదే స్థాయిని కొనసాగించడం సులభం కాదు. కానీ, అతను ప్రపంచకప్‌లో ఆడిన తీరు నన్ను చాలా ఆకట్టుకుంది. చాలా ప్రొఫెషనల్‌గా ఆడాడు. తన వయసుకు మించిన పరిణతి అతనిలో ఉంది. ఐపీఎల్‌లో ఎలా ఆడాడో, అదే ఆటతీరును కొనసాగించాడు. బౌలర్ల పట్ల దురుసుగా ప్రవర్తించలేదు. అతను కచ్చితంగా మంచి ప్రొఫెషనల్‌గా ఎదుగుతాడు" అని డివిలియర్స్ కొనియాడాడు.

అయితే, జితేశ్ శర్మ మాత్రం వైభవ్ మైదానం బయట అలవాట్లపై భిన్నంగా స్పందించాడు. "అతను ప్రొఫెషనల్ కాదు. ఈ విషయం నేను కచ్చితంగా చెప్పగలను" అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించాడు. "అందరూ అతడిని ప్రొఫెషనల్‌గా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. కానీ, అతను ఎప్పటికీ మారడని నేను అనుకుంటున్నాను, కనీసం మైదానం బయట అయినా, నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. రాత్రిపూట ఐస్‌క్రీమ్ తినొద్దని చెబుతున్నాను. కానీ, అతను అస్సలు వినడు" అని జితేశ్ సరదాగా చెప్పాడు.

మైదానంలో అద్భుత ప్రతిభ కనబరుస్తూ, బయట ఇలాంటి చిన్న చిన్న సరదాలతో గడిపే వైభవ్ తీరు అతని స్టార్‌డమ్‌కు కొత్త ఆకర్షణ తెచ్చిపెడుతోంది. అయితే, క్రికెట్‌లో సుదీర్ఘకాలం రాణించాలంటే కఠినమైన ఆహార నియమాలు, ఫిట్‌నెస్ అత్యంత కీలకమ‌ని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Go Back to Shorts
Vaibhav Suryavanshi
IPL 2026
Rajasthan Royals
AB de Villiers
Jitesh Sharma
Under-19 Cricket
Cricket
Ice Cream
Fitness

More Telugu News