Iran: హర్మూజ్ జలసంధిలో ఇరాన్ కొత్త మెలిక.. నౌక దాటాలంటే రూ.18 కోట్లు కట్టాల్సిందే!

Iran to Charge Transit Fee for Ships Passing Through Hormuz Strait
షార్ట్స్‌లో చూడండి
ప్రపంచ చమురు వాణిజ్యానికి జీవనాడి వంటి హర్మూజ్ జలసంధిలో ఇరాన్ తీసుకున్న ఓ సంచలన నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో, ఈ కీలకమైన జలసంధి గుండా ప్రయాణించే ప్రతి వాణిజ్య నౌక నుంచి ఏకంగా 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.18.76 కోట్లు) 'ట్రాన్సిట్ ఫీజు'గా వసూలు చేయాలని ఇరాన్ యోచిస్తోంది. ఈ విషయాన్ని ఇరాన్‌కు చెందిన ఒక కీలక పార్లమెంటు సభ్యుడు వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించాయి.

ప్రస్తుతం అమెరికాతో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో తమ రక్షణ వ్యయాలను భరించడానికి, జలసంధిలో భద్రతను పర్యవేక్షించడానికి ఈ నిధులు అవసరమని ఇరాన్ వాదిస్తోంది. ఫిబ్రవరి 28 నుంచి ఈ మార్గాన్ని మూసివేసి అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకాలు సృష్టించిన ఇరాన్, ఇప్పుడు దాన్ని పాక్షికంగా తెరిచినా భారీ మూల్యం చెల్లించాల్సిందేనని పరోక్ష సంకేతాలు పంపుతోంది. ఈ చర్య ద్వారా పెద్ద ఎత్తున నిధులు సమీకరించుకోవాలనేది ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది.

రోజుకు లక్షల బ్యారెళ్ల ముడిచమురు రవాణా అయ్యే హర్మూజ్ జలసంధిలో ఈ 'టోల్ టాక్స్' గనుక అధికారికంగా అమలైతే దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఇప్పటికే యుద్ధం కారణంగా పెరిగిన రవాణా ఖర్చులతో సతమతమవుతున్న షిప్పింగ్ సంస్థలపై ఇది పెను భారంగా మారనుంది. అంతిమంగా ఈ భారం ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు దారితీస్తుందని, ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి కోలుకోలేని దెబ్బ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు, ఇరాన్ ప్రతిపాదనపై అంతర్జాతీయ షిప్పింగ్ కౌన్సిల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి ఏకపక్ష వసూళ్లు అంతర్జాతీయ సముద్ర చట్టాలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేసింది. ఇరాన్ తీరంలో ఇప్పటికే అనేక ట్యాంకర్లు నిలిచిపోవడంతో సరఫరా వ్యవస్థ స్తంభించిపోగా, ఈ కొత్త నిబంధన వివాదాన్ని మరింత జఠిలం చేస్తోంది.
Go Back to Shorts
Iran
Hormuz Strait
Transit Fee
Oil Tankers
Shipping
International Trade
Middle East
Crude Oil
Persian Gulf
Maritime Law

More Telugu News