Sajjanar: ఈ అమ్మాయిలు నిజం కాదు.. వారి ట్రాప్‌లో పడకండి: సజ్జనార్ హెచ్చరిక

Sajjanar Warns Against AI Generated Honeytrap Videos
షార్ట్స్‌లో చూడండి
"మీరు ఒంటరిగా ఉంటున్నారా, ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని మాట్లాడుకోండి" అంటూ అమ్మాయిలు చెబుతున్నట్లుగా ఉన్న వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. యువత ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు హానీట్రాప్ చేస్తున్నారని, ఏఐ జనరేటెడ్ వీడియోల ద్వారా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని సూచించారు. ఈమేరకు ఆయన 'ఎక్స్' వేదికగా యువతకు సూచన చేశారు.

"ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి. మీ రంగు, రూపంతో మాకు పనిలేదు" అంటూ సోషల్ మీడియాలో  ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తున్న ఈ యాడ్స్ వెనుక ఉన్నది తీయటి మాటలు కాదని, నిలువునా దోచేసే సైబర్ కేటుగాళ్ల ఉచ్చు అని పేర్కొన్నారు. ఈ వీడియోల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమ్మాయిలు నిజం కాదని, అవన్నీ ఏఐ సాయంతో సృష్టించిన వీడియోలు అని తెలిపారు.

మాయమాటలకు బుట్టలోపడి వారు సూచించిన  యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటే ముప్పు కొనితెచ్చుకున్నట్లేనని హెచ్చరించారు. ఆ లింక్ ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకోగానే, మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్, గ్యాలరీ మొత్తం వారి అధీనంలోకి వెళ్లిపోతాయని అన్నారు. ఇక రాత్రిపూట సరదాగా మాట్లాడదామని వీడియో కాల్ చేస్తే అవతలి వైపు న్యూడ్ వీడియోలు ప్లే చేసి, స్క్రీన్‌పై ఉన్న మీ ముఖాన్ని రికార్డ్ చేస్తారని, ఆ తర్వాత దాన్ని మార్ఫింగ్ చేసి, మీ కాంటాక్ట్ లిస్ట్‌లోని బంధుమిత్రులకు పంపుతామంటూ బ్లాక్‌మెయిలింగ్‌ కు దిగుతారని హెచ్చరించారు.

పరువు పోతుందన్న భయంతో వారు అడిగినంత ఇచ్చుకుంటూ పోతే మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వడం ఖాయమని సజ్జనార్ పేర్కొన్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి మోసపూరిత ప్రకటనలు ఇస్తున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆన్‌లైన్‌లో ఎవరూ మీకు ఊరికే స్నేహితులు కాబోరని, ఆ ఆకర్షణ వెనుక మీ డబ్బు, పరువు లాగేసే భారీ కుట్ర దాగి ఉందని గ్రహించాలని అన్నారు.

క్షణికావేశంలో గుర్తుతెలియని ఫేక్ డేటింగ్, వీడియో కాలింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. రాత్రి వేళల్లోనే ఈ యాడ్స్ దర్శనమిస్తున్నాయని... జాగ్రత్తగా ఉండండని యువతకు సూచన చేశారు. ఒకవేళ ఇప్పటికే ఎవరైనా ఇలాంటి సైబర్ వలలో చిక్కుకుంటే, పరువుపోతుందేమో అని భయపడవద్దని, వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయండి లేదా http://cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
Go Back to Shorts
Sajjanar
Hyderabad CP
Cybercrime
AI generated videos
Honeytrap
Sextortion
Online dating apps

More Telugu News