భట్టి నివాసంలో ఏపీ సీఎం చంద్రబాబు... నూతన దంపతులకు ఆశీస్సులు... ఫొటోలు ఇవిగో!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లారు. ఇటీవల వివాహం చేసుకున్న భట్టి కుమారుడు సూర్య విక్రమాదిత్య, కోడలు సాక్షిలను ఆశీర్వదించేందుకు చంద్రబాబు ఆయన ఇంటికి చేరుకున్నారు.

చంద్రబాబుకు భట్టి విక్రమార్క సాదర స్వాగతం పలికారు. అనంతరం నూతన దంపతులను కలిసిన చంద్రబాబు, వారికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. దంపతులు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కాసేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.

ఇటీవల భట్టి విక్రమార్క తన కుమారుడి వివాహానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు స్వయంగా అమరావతికి వెళ్లారు. అయితే, అప్పటి పనుల ఒత్తిడి కారణంగా చంద్రబాబు వివాహ వేడుకకు హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పర్యటనలో భాగంగా భట్టి ఇంటికి వెళ్లి నూతన దంపతులకు విషెస్ తెలియజేశారు.

మార్చి 5న శంషాబాద్ జీఎంఆర్ ఎరీనాలో జరిగిన ఈ వివాహ వేడుకకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సినీనటుడు చిరంజీవి వంటి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరైన విషయం తెలిసిందే. 


More Telugu News